దర్జాగా కబ్జా!

10 Mar, 2019 08:18 IST|Sakshi
ఉయ్యలవాడ శివారులో ఓ కుంట శిఖం భూమిలో రాళ్లు పాతిన రియల్టర్లు

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ వెంచర్లు 

నాగర్‌కర్నూల్‌ రూరల్‌: జిల్లా కేంద్రం సరిహద్దు ప్రాంతాల్లో వెలసిన అక్రమ వెంచర్లపై అధికారుల నజర్‌ లేకపోవడంతో ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రైవేటు పట్టా భూములతో పాటు అందినంత ప్రభుత్వ భూములను కబ్జా చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎక్కడా లేనివిధంగా రియల్టర్లు సిండికేట్‌గా మారి వ్యాపారాన్ని దర్జాగా కొనసాగిస్తున్నారు. సిండికేట్‌ దగ్గరకు రావాలంటేనే అధికారులే ఆందోళన చెందే స్థాయికి ఎదగడంతో జిల్లా సమీపంలోని చెరువులు, కుంటలు అన్యాక్రాంతమై ప్రభుత్వ భూములు కుచించుకుపోతున్నాయి.రోజురోజుకు అక్రమంగా వెంచర్లు వెలుస్తున్నా వాటిని నిలువరించడంలో అధికారులు విఫలమవుతున్నారు. రియల్టర్లుగా పలుకుబడి కలిగిన వ్యక్తులు పలు పార్టీల నాయకుల చెలామణిలో ఉంటూ ఎప్పటికప్పుడు పుకార్లను షికార్లుగా మలుచుకుని ధరలు అమాంతం పెంచుకుంటూ లాభపడుతున్నారు.  

సరిహద్దు ప్రాంతాల్లో వెంచర్లు 
జిల్లా కేంద్రం సరిహద్దు ప్రాంతాలైన ఎండబెట్ల, దేశియిటిక్యాల, ఉయ్యలవాడ, మంతటి, గగ్గలపల్లి, నల్లవల్లి రోడ్డు వెంబడి ప్రధాన రహదారుల ఇరువైపులా పంట పొలాలను రియల్టర్లు కొనుగోలు చేసుకుని రియల్‌ దందాకు కొనసాగిస్తున్నారు. వీటితో పాటు ఒకప్పుడు వర్షపు నీటితో కళకళలాడిన చెరువు శిఖం భూములు, కుంటల భూముల్లోనూ రియల్టర్లు ప్లాట్లుగా మలిచి అందినకాడికి దండుకుంటున్నారు.ఫుల్‌ ట్యాంక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ శిఖం భూముల్లో మట్టిని పోసి ప్లాట్లుగా మార్చేశారు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా పంట భూములన్నీ ప్లాట్లుగా మారిపోతున్నాయి.

ఎలాంటి అనుమతులు లేకుండానే.
పంటలతో కళకళలాడిన పంట పొలాలు సైతం ఇప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లుగా మారిపోతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలంటే ముందుగా రెవెన్యూ అధికారుల అనుమతులు పొందాల్సి ఉంది.అంతేకాక ఆయా భూముల్లో పబ్లిక్‌ అవసరాల కోసం 10 శాతం భూమి కేటాయించాల్సి ఉంది. ఎలాంటి అనుమతులు పొందకుండా ప్లాట్లను ఏర్పాటు చేస్తుండటంతో భవిష్యత్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు నిర్మాణ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా అక్రమ వెంచర్ల రియల్టర్లపై అధికారులు నజర్‌ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు.   

మరిన్ని వార్తలు