డిప్యూటీ సీఎం నివాసం జలదిగ్బంధం

1 Oct, 2019 03:21 IST|Sakshi
డిప్యూటీ సీఎం సుశీల్‌ మోదీ(కుడివైపు చివర) కుటుంబసభ్యుల్ని రబ్బర్‌ బోట్‌లో తరలిస్తున్న దృశ్యం

బిహార్‌లో రబ్బరు బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలింపు

వర్షాల ధాటికి దేశంలో157 మంది మృతి

న్యూఢిల్లీ: ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలతో బిహార్, ఉత్తరప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా వర్షాల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య సోమవారానికి 157కు చేరుకుంది. గత వారం రోజుల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 111 మంది, బిహార్‌లో 27 మంది చనిపోగా.. గుజరాత్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో కలిపి 19 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

బిహార్‌ రాజధాని పట్నాలో కుండపోత వానలతో డిప్యూటీ సీఎం సుశీల్‌ మోదీ అధికార నివాసం సోమవారం జల దిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో ఆయనతోపాటు కుటుంబసభ్యులను పోలీసులు రబ్బర్‌బోట్‌లో సురక్షిత ప్రాంతానికి తరలించారు. పట్నాలోని చాలా ప్రాంతాలు మూడు రోజులుగా నీటిలోనే నానుతున్నాయి. వానల తీవ్రత దృష్ట్యా యూపీ ప్రభుత్వం అధికారుల సెలవులు రద్దు చేసింది. బలియా జిల్లా జైలులోకి వరద ప్రవేశించడంతో 900 మంది ఖైదీలను వేరే జైళ్లకు తరలించారు. 

మరిన్ని వార్తలు