వాయుసేన విమానం గల్లంతు

4 Jun, 2019 05:24 IST|Sakshi

ఈటానగర్‌/న్యూఢిల్లీ: 13 మందితో బయలుదేరిన భారత వాయుసేన (ఐఏఎఫ్‌)కు చెందిన ఏఎన్‌32 రకం విమానం గాలిలోకి ఎగిరిన 33 నిమిషాల అనంతరం గల్లంతైంది. అస్సాం లోని జొర్హాత్‌ నుంచి మధ్యాహ్నం 12.27 గంటలకు బయలుదేరిన ఈ విమానం అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెంచుకాకు (చైనా సరిహద్దుకు దగ్గర్లో) చేరాల్సి ఉండగా, మార్గమధ్యంలోనే కనిపించకుండా పోయింది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత విమానం ఆచూకీ లభించలేదని అధికారులు తెలిపారు. ఐఏఎఫ్‌ ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘కొన్నిచోట్ల విమానం కూలిపోయి ఉండొచ్చని మాకు సమాచారం రావడంతో అక్కడంతా గాలించాం. కానీ ఏఎన్‌–32 విమానం కానీ, దాని శకలాలు కానీ ఎక్కడా కనిపించలేదు.

విమానంలో 8 మంది సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులు కలిపి మొత్తం 13 మంది ఉన్నారు’ అని తెలిపింది. తప్పిపోయిన విమానాన్ని గుర్తించేందుకు ఆర్మీతోపాటు అన్ని ప్రభుత్వ విభాగాలు, శాఖలతో సమన్వయంతో పనిచేస్తున్నామని వాయుసేన వెల్లడించింది.  రాత్రంతా  గాలింపును కొనసాగిస్తామంది. విమానం గల్లంతైన ఘటనకు సంబంధించి ఐఏఎఫ్‌ వైస్‌ చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ రాకేశ్‌ సింగ్‌ బహదూరియాతో తాను మాట్లాడినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ తెలిపారు. 2009 జూన్‌ నెలలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే అరుణాచల్‌లో జరిగింది. ఏఎన్‌–32 రకం విమానం 13 మందిని ఎక్కించుకుని వెళ్తుండగా అరుణాచల్‌ ప్రదేశ్‌లోనే కూలిపోయింది. అందులోని మొత్తం 13 మంది మరణించారు. పశ్చిమ సియాంగ్‌ జిల్లాలోని రించీ హిల్‌పైన ఆ విమానం కూలిపోయింది.

మరిన్ని వార్తలు