బెంగళూరును వణికించిన వాన

15 Oct, 2017 02:55 IST|Sakshi

బెంగళూరు: బెంగళూరులో వర్ష బీభత్సం కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే వేర్వేరు చోట్ల ఐదుగురు మృతిచెందారు. పశ్చిమ, దక్షిణ భాగాల్లో చాలా ప్రాంతాల్లో నీరు రోడ్డుపైనే నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. నీటిపై తేలియాడుతున్న కారులో చిక్కుకున్న మహిళను కొందరు యువకులు కాపాడిన వీడియా సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. మైసూర్‌ రోడ్డులోని నాయందహల్లి సర్కిల్‌లో శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది.

కురుబ్రహల్లి ప్రాంతంలో డ్రైనేజీలో పడి కొట్టుకుపోయిన వాసుదేవ్‌ భట్‌ అనే పూజారి మృతదేహం శనివారం ఉదయం లభ్యమైంది. మరోవైపు, కనిపించకుండా పోయిన అదే ప్రాంతానికి చెందిన తల్లీకూతుళ్లు కూడా డ్రైనేజీలో కొట్టుకుపోయి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక కార్యక్రమాలను చురుగ్గా కొనసాగిస్తున్నాయి. సీఎం సిద్ధరామయ్య శనివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాణ నష్టంపై విచారం వ్యక్తం చేసిన ఆయన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.  

మరిన్ని వార్తలు