మోదీకి ‘గుజరాత్‌’ పరీక్ష! | Sakshi
Sakshi News home page

మోదీకి ‘గుజరాత్‌’ పరీక్ష!

Published Sun, Oct 15 2017 3:15 AM

India-readies-for-the-semi-final-of-election - Sakshi

సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌: నవంబర్‌లేదా డిసెంబర్‌లో జరిగే గుజరాత్‌ 14వ శాసనసభ ఎన్నికలు 2019 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా పరిగణిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ గుజరాతీ కావడంతోపాటు  ఆ రాష్ట్రానికి 12 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేయడంతో ఈ ఎన్నికలు ఆయన ప్రతిష్టకు పరీక్షగానే అంచనావేస్తున్నారు. 1995 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ మళ్లీ పాతికేళ్ల అనంతరం ఆరోసారి అధికారం కోసం పోటీపడుతోంది. మోదీ తర్వాత ఆనందీబెన్‌ పటేల్, విజయ్‌ రూపాణీ(ప్రస్తుతం) సీఎంలుగా చేసినా రాష్ట్రంలో బలమైన ముఖ్యమంత్రి లేరనే భావన జనంలో ఉంది.

రాష్ట్రంలో ఆధిపత్యవర్గమైన పాటీదార్లు(పటేళ్లు) రిజర్వేషన్‌ డిమాండ్‌తో బీజేపీకి దూరమయ్యారు. పాటీదార్‌ యువనేత హార్దిక్‌ పటేల్‌ బాహాటంగా కాంగ్రెస్‌కు మద్దతిస్తుండగా, రాష్ట్ర జనాభాలో పది పన్నెండు శాతమున్న పటేళ్లు బీజేపీని ఏ మేరకు అధికారంలోకి రాకుండా అడ్డుకుంటారనేది ప్రశ్నార్థకమే. గుజరాత్‌లో ఇటీవల దళితులపై జరిగిన దాడుల ఫలితంగా వారు కూడా జిగ్నేష్‌ మేవానీ అనే యువనేత నేతృత్వంలో ఉద్యమించడం కూడా బీజేపీకి ఎన్నికల్లో ఎంతవరకూ నష్టమో వేచిచూడాలి.

మోదీ రాకతో మారిన రాజకీయ చిత్రం
బీజేపీ సీఎంగా రెండుసార్లు పనిచేసిన కేశూభాయ్‌ పటేల్‌ 2001 అక్టోబర్‌లో రాజీనామా చేశాక అప్పటి బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి వరకూ ఎన్నికల్లో పోటీచేయని మోదీ తన శక్తియుక్తులతో రాష్ట్ర రాజకీయ చిత్రాన్ని శాశ్వతంగా మార్చేశారు. మోదీ గద్దెనెక్కిన ఐదు నెలలకే 2002 ఫిబ్రవరిలో జరిగిన గోధ్రా అల్లర్లు ఆయన ప్రతిష్టకు మాయనిమచ్చగా మారాయి. అయితే పది నెలలకే డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182కిగాను బీజేపీకి 127 సీట్లు (49.85 శాతం ఓట్లతో) సాధించడంతో మోదీ సుదీర్ఘ పాలనకు గట్టి పునాదిపడింది.

2012 డిసెంబర్‌ ఎన్నికల్లో వరుసగా మూడో విజయం ఆయనను బీజేపీ ప్రధాని అభ్యర్థిని చేసింది. దేశ ప్రధాని పదవిని చేపట్టి మూడున్నరేళ్లకు పైగా అధికారంలో కొనసాగుతున్న మోదీకి లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగే ఈ అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇటీవలి గుజరాత్‌ పర్యటనల్లో జనం కనిపిస్తున్నా గెలుపుపై ఆ పార్టీకి అంతగా నమ్మకం లేదు.

అదీగాక 20 ఏళ్లు కాంగ్రెస్‌లో కొనసాగి ఇటీవల రాజీనామా చేసిన వాఘేలా కనీసం నాలుగు జిల్లాల్లో కాంగ్రెస్‌ విజయావకాశాలను దెబ్బతీస్తారని భావిస్తున్నారు. గుజరాత్‌ 57 ఏళ్ల చరిత్రలో 1975, 1990 ఎన్నికల్లో మాత్రమే త్రిశంకు సభ ఏర్పడింది. 2001 అక్టోబర్‌ నుంచి కొనసాగుతున్న రాజకీయ సుస్థిరతను మోదీ నాయకత్వంలోని గుజరాత్‌ బీజేపీ వచ్చే ఎన్నికల్లో విజయం ద్వారా కొనసాగిస్తుందా లేదా అనేది మూడు నెలల్లో తేలిపోతుంది.

కొన్నాళ్లు కాంగ్రెస్‌ హవా
1980, 1985 అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్‌లో క్షత్రియులు, హరిజనులు, ఆదివాసీలు, ముస్లింల(ఈ నాలుగు వర్గాల్ని కలిపి ఖామ్‌ అని పిలుస్తారు) మద్దతుతో కాంగ్రెస్‌ విజయం సాధించి వరుసగా పదేళ్లు పాలించింది. ఆ కాలంలోనే రిజర్వేషన్‌ వ్యతిరేక ఉద్యమాలు ఉవ్వెత్తున లేచి చివరికి మతఘర్షణలతో ముగిశాయి. 1990 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ కాంగ్రెస్‌ సీఎం చిమన్‌భాయ్‌ పటేల్‌ నాయకత్వాన జనతాదళ్‌–బీజేపీ సంకీర్ణం ఏడు నెలలకే ముగిసింది. చిమన్‌భాయ్‌ పార్టీని చీల్చి జేడీ(గుజరాత్‌) పేరుతో కాంగ్రెస్‌తో చేతులు కలిపి సంకీర్ణ సర్కారు నడిపించారు.

తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌తో విలీనం చేశారు. మళ్లీ ఆరెస్సెస్‌ మూలాలున్న బీజేపీ క్షత్రియ నేత, గుజరాత్‌లో కాషాయపక్షం విస్తరణకు విశేష కృషిచేసిన శంకర్‌సింహ్‌ వాఘేలా ఏడాదిపాటు సీఎం పదవిలో కొనసాగేందుకు కాంగ్రెస్‌ మద్దతిచ్చింది. వాఘేలాతో విభేదాల అనంతరం గుజరాత్‌ జనతాపార్టీకి చెందిన దిలీప్‌ పారిఖ్‌ను గద్దెనెక్కించిన కాంగ్రెస్‌ నాలుగు నెలలకే  ఆ సర్కారును కూలదోసింది. ఈ తరహా రాజకీయాలతో కాంగ్రెస్‌ బాగా నష్టపోయింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement