రెండేళ్లు.. 172 దాడులు

7 Sep, 2017 03:09 IST|Sakshi
రెండేళ్లు.. 172 దాడులు
24 ఏళ్లలో 70 మంది జర్నలిస్టుల మృత్యువాత 
- ఆందోళన కలిగిస్తోన్న జర్నలిస్టులపై దాడులు 
పత్రికా స్వేచ్ఛా సూచిలో 136వ స్థానంలో భారత్‌
 
ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌ దారుణ హత్య నేపథ్యంలో అసలు దేశంలో జర్నలిస్టులకు రక్షణ ఎంత అనే ప్రశ్న ఉదయిస్తోంది. 2014, 2015 ఈ రెండేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై ఏకంగా 142 దాడులు జరిగాయని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) తాజా గణాంకాలు వెల్లడించాయి. ఈ 142 దాడులకు సంబంధించి 73 మంది అరెస్ట్‌ అయినట్టు ఎన్‌సీఆర్‌బీ గణాంకాలను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలైలో పార్లమెంట్‌లో ప్రకటించింది.


జర్నలిస్టులపై దాడులకు సంబంధించి 2014 నుంచి ఎన్‌సీఆర్‌బీ గణాంకాలను సేకరిస్తోంది. 2014లో 114, 2015లో 28 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా 64 కేసులతో ఉత్తరప్రదేశ్‌ తొలి స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్‌లో 26, బిహార్‌లో 22 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తం కేసుల్లో 79 శాతం ఈ మూడు రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. ఇక మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 42 మంది (2014లో 10 మంది, 2015లో 32 మంది) అరెస్ట్‌ అయ్యారు.
 
24 ఏళ్లలో 70 మంది మృత్యువాత..
మొత్తంగా చూస్తే 1992 నుంచి 2016 వరకూ అంటే 24 ఏళ్ల కాలంలో వివిధ కారణాల వల్ల మరణించిన జర్నలిస్టుల సంఖ్య 70 వరకూ ఉంటుందని ద కమిటీ టు ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్‌ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ప్రకటించింది. వీరిలో 40 మంది జర్నలిస్టుల మరణాలు నిర్ధారణ అయ్యాయని, 27 మంది హత్యకు గురికాగా.. మరో 13 మంది ప్రమాదకరమైన అసైన్‌మెంట్లను అప్పగించడం వల్ల మరణించినట్టు వెల్లడించింది. కాగా, రిపోర్టర్స్‌ విత్‌అవుట్‌ బోర్డర్స్‌ సంస్థ విడుదల చేసిన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక–2017 ప్రకారం.. 180 దేశాల్లో మనదేశం 136వ స్థానంలో నిలిచింది.
– సాక్షి తెలంగాణ డెస్క్‌
మరిన్ని వార్తలు