4 కోట్ల కుటుంబాలకు వెలుగుల సౌభాగ్యం

26 Sep, 2017 02:49 IST|Sakshi

ఉచిత విద్యుత్‌ కనెక్షన్ల పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

రూ.16,320 కోట్లతో డిసెంబర్‌ 2018 నాటికి అందరికీ విద్యుత్‌

న్యూఢిల్లీ: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 4 కోట్లకు పైగా కుటుంబాలకు ఉచితంగా విద్యుత్‌ కనెక్షన్లు అందించేందుకు ఉద్దేశించిన ‘సౌభాగ్య’ పథకాన్ని (ప్రధాన మంత్రి సహజ్‌ బిజిలీ హర్‌ ఘర్‌ యోజన) ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా రూ. 16,320 కోట్లతో డిసెంబర్‌ 2018 నాటికి దేశంలో విద్యుత్‌ సదుపాయం లేని కుటుంబాలకు కనెక్షన్లను అందచేస్తారు.

సౌభాగ్య పథకం ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం పేదల ఉన్నతికి కట్టుబడి ఉందని.. జన్‌ ధన్‌ యోజన నుంచి ముద్రా యోజన వరకూ ఎన్నో పథకాలు ప్రారంభించిందని గుర్తు చేశారు. ‘స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అవుతున్నా.. దేశంలో 25 కోట్లకుగాను 4 కోట్ల కుటుంబాలకు ఇంకా కరెంటు సదుపాయం లేదు.

పేదల జీవితాల్లో భారీ మార్పు తీసుకొచ్చేందుకు రూ. 16 వేల కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించాం’అని చెప్పారు. ఈ పథకంలో పేద కుటుంబాలకు ఉచితంగా విద్యుత్‌ కనెన్షన్లు అందచేస్తామని తెలిపారు. గతంలో విద్యుత్‌ కోతలు, విద్యుదుత్పత్తి కేం ద్రాలకు బొగ్గు కొరతను వార్తల్లో బ్రేకింగ్‌ న్యూస్‌గా చెప్పేవారని, ఇప్పుడు పరిస్థితి మారిందని.. దేశం విద్యుత్‌ కొరత నుంచి విద్యుత్‌ మిగులు వైపు అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.

‘మనం చేపట్టిన అనేక చర్యలు ఈ రోజు విద్యుత్‌ మిగులు సాధించేందుకు సాయపడ్డాయి. ఎల్‌ఈడీ బల్పుల ఉపయోగంతో సంవత్సరానికి రూ. 13,700 కోట్లు ఆదాచేస్తున్నాం. సోలార్‌ విద్యుత్‌ రేటు యూనిట్‌కు రూ. 2.44కు తగ్గింది’ అని మోదీ చెప్పారు. కరెంటు కుక్క ర్లు వంటి వంట వస్తువులు అభివృద్ధి కోసం ఓఎన్జీసీ రూ. 100 కోట్ల స్టార్టప్‌ నిధుల్ని వినియోగించాలని, అందువల్ల ఇంధన వినియోగం తగ్గుతుందన్నారు.  

‘సౌభాగ్య’ పథకం వివరాలు
► ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ. 16,320 కోట్లు..  

► గ్రామీణ ప్రాంతాల్లో విద్యుదీకరణకు రూ. 14,025 కోట్లు,  

► పట్టణాల్లో విద్యుదీకరణకు రూ. 2,295 కోట్లు  

► ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్రాలు 10 శాతం నిధులు సమకూరుస్తాయి. మిగతా మొత్తం రుణాల రూపంలో సేకరిస్తారు.

► సామాజిక, ఆర్థిక, కుల గణన(ఎస్‌ఈసీసీ)– 2011 సమాచారం ఆధారంగా ఉచిత విద్యుత్‌ కనెక్షన్ల కోసం లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తారు. ఎస్‌ఈసీసీ కిందకు రాని వారికి కూడా విద్యుత్‌ కనెక్షన్లు లేకపోతే ఈ సదుపాయం కల్పిస్తారు. అయితే వారి నుంచి 500 రూపాయల్ని 10 వాయిదాల్లో విద్యుత్‌ బిల్లుల ద్వారా డిస్కంలు వసూలు చేస్తాయి.  

► మారుమూల, వెళ్లేందుకు అనువుగాని ప్రాంతాల్లోని గృహాలకు 200 నుంచి 300 వాట్స్‌పవర్‌ సోలార్‌ పవర్‌ యూనిట్లను బ్యాటరీ బ్యాంక్‌తో ఏర్పాటు చేస్తారు. ఐదు ఎల్‌ఈడీ లైట్లు, ఒక డీసీ ఫ్యాన్, ఒక డీసీ పవర్‌ ప్లగ్‌ను కూడా అందచేస్తారు.

► గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఆర్‌ఈసీ) ఈ పథకానికి దేశమంతా నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.  
లబ్ధిదారుల్ని ఎంపికచేశాక దరఖాస్తు పత్రాన్ని అక్కడికక్కడే రిజిస్ట్రేషన్‌ చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ సంస్థలు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తు పత్రాలు సేకరించడం, బిల్లుల పంపిణీ, రెవెన్యూ వసూళ్లను చూసుకుంటాయి.

► మార్చి 2019 నాటికి దేశంలోని అన్ని గ్రామాల విద్యుదీకరణకు, 24 గంటల విద్యుత్‌ సరఫరా అందించేందుకు కృషిచేస్తున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు