‘ఆప్‌’ ఎమ్మెల్యేకు జైలుశిక్ష

4 Jul, 2019 15:34 IST|Sakshi
ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్‌దత్‌

న్యూఢిల్లీ : ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా దాడి చేసినందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్‌దత్‌కు ఢిల్లీ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష, రూ. రెండు లక్షల జరిమానా విధించింది. సోమ్‌దత్‌ ప్రస్తుతం పాత ఢిల్లీలోని సదర్‌ బజార్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ వారంలోనే మరో ఆప్‌ ఎమ్మెల్యే జైలుకి వెళ్లడం ఇది రెండోసారి. ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించినందుకు కొండ్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మనోజ్‌కుమార్‌కు కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. 

ఈ నెల జూన్‌ 29న చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ సమర్‌ విశాల్‌.. సోమ్‌దత్‌ను దోషిగా నిర్ధారించి శిక్ష విధించారు. శిక్షను సవాల్‌ చేయడానికి సోమ్‌దత్‌కు మెట్రోపాలిటన్‌ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసు జనవరి 2015 నాటిది. అప్పటికి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న సోమ్‌దత్‌ తనపై దాడి చేసినట్లు సంజీవ్‌ రానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రానా తెలిపిన వివరాల ప్రకారం.. సోమ్‌దత్‌ తన అనుచరులు 50-60 మందితో కలిసి తన ఫ్లాట్‌కు వచ్చి పదే పదే బెల్‌ కొట్టారని ఆరోపించారు. ఇలా దౌర్జన్యం చేయడం ఏమిటని ప్రశ్నించినందుకు తనను బయటకి లాగి బేస్‌బాల్‌ బ్యాట్‌తో దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న సునీల్‌ ఎమ్మెల్యే సోమ్‌దత్‌ బేస్‌బాల్‌ బ్యాట్‌తో రానాపై దాడి చేయడం నిజమేనని కోర్టుకు తెలిపాడు. 

వచ్చే ఎన్నికల్లో తనకు అసెంబ్లీ టికెట్‌ దక్కకుండా దెబ్బ తీసేందుకే  బీజేపీ ఇలాంటి కుట్రలు పన్నుతుందని, అందుకు రానాను పావులా వాడుకున్నారని సోమ్‌దత్‌ కోర్టుకు వెల్లడించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని సోమ్‌దత్‌ ఎలాంటి సాక్ష్యాలు చూపకపోవడంతో ఆయన జైలు శిక్ష విధించినట్టు ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. 


 

మరిన్ని వార్తలు