మనసులు మాత్రం!

22 Nov, 2017 07:37 IST|Sakshi

మైత్రేయన్‌ గళం పన్నీరు మదిలో మాటేనా..?

శిబిరంలో ముసలమా

సీఎం మద్దతుదారుల్లో చర్చ

కేడర్‌లో విస్మయం

సాక్షి, చెన్నై : ‘విలీన ప్రక్రియ జరిగి కాలం గడుస్తున్నా.. మనసులు మాత్రం..!’ అంటూ పన్నీరు మద్దతు ఎంపీ మైత్రేయన్‌ వ్యాఖ్యలు అన్నాడీఎంకే సర్కారులో మంగళవారం హాట్‌ టాపిక్‌గా మారింది. పన్నీరు మదిలో మాట ఇదేనా..! తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మైత్రేయన్‌ అసంతృప్తి గళాన్ని వినిపించే పనిలో పడ్డారా..? అన్న చర్చ ఊపందుకుంది.

చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా తిరుగు బావుటా ఎగురవేసిన మాజీ సీఎం పన్నీరు సెల్వం తనబలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నించి చతికిలపడ్డారు. ఎట్టకేలకు చిన్నమ్మ జైలుకు వెళ్లడం, సీఎం పళనిస్వామి బలం పెరగడం వెరసి విలీన బాటసాగింది. పళని, పన్నీరులు ఏకం అయ్యారు. సీఎంగా పళని, డిప్యూటీ సీఎంగా పన్నీరుల పయనం ప్రస్తుతం సాగుతోంది. అయితే, పన్నీరు శిబిరం మాత్రం అసంతృప్తితోనే ఉందని చెప్పవచ్చు. ఆయన మద్దతు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు పార్టీ పరంగా గానీ, ప్రభుత్వ పరంగా గానీ న్యాయం జరిగి ఉంటే ఒట్టు. అదే సమయంలో పన్నీరు అధికారాల్ని పీకి, కేవలం పదవిని మాత్రం కట్టబెట్టి ఉన్నారన్న ఆరోపణలున్నాయి. సీఎం పళనిస్వామి బలం మాత్రం రోజురోజుకు ఢిల్లీ స్థాయిలో పెరుగుతున్నా, పన్నీరు మాత్రం పతనం అవుతున్నారన్న ఆందోళన మద్దతు దారుల్లో ఉందని చెప్పవచ్చు. నమ్మి వచ్చిన వారికి న్యాయం చేయలేని పరిస్థితిలో డిప్యూటీ అన్న పదవిని అలంకార ప్రాయంగా పన్నీరు కల్గి ఉండడం ఆయన మద్దతుదారుల్లో అసంతృప్తిని రగుల్చుతోంది. ఇప్పటికే కొన్నిచోట్ల ఆయన మద్దతుదారులు సీఎం కార్యక్రమాన్ని బహిష్కరించే పనిలో పడ్డారు.

మైత్రేయన్‌ ట్వీట్‌పై చర్చ
సీఎం, డిప్యూటీలు ఒకే వేదిక మీద కనిపిస్తున్నా, మద్దతుదారులు మాత్రం వేర్వేరుగా పయనం సాగిస్తుండడంతో ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయోనన్న చర్చ సాగుతోంది. ఈనేపథ్యంలో పన్నీరుకు అత్యంత సన్నిహితుడిగా, శశికళకు వ్యతిరేకంగా తిరుగుబాటు సాగిన క్రమంలో కీలక పాత్ర పోషించిన ఎంపీ మైత్రేయన్‌ మంగళవారం చేసిన ట్విట్‌ చర్చకు దారితీసింది. ఇరు శిబిరాలు విలీనమై మూడు నెలలు ముగిసి, నాలుగో నేల మంగళవారంతో అడుగు పెట్టినట్టు గుర్తుచేశారు. ‘విలీన ప్రక్రియ జరిగి కాలం గడుస్తున్నా.. అంటూ, మనస్సులు..? మాత్రం..!’ అన్న ప్రశ్నార్థకం, ఆశ్చర్యకర అర్థాలతో చర్చకు తెరలేపడం గమనార్హం. పన్నీరు మదిలో మాటను ఆయన బయట పెట్టారా..? లేదా, సాగుతున్న పరిణామాల నేపథ్యంలో అసంతృప్తిని వెల్లగక్కే విధంగా స్పందించారా..? అన్నచర్చ బయలు దేరింది. అసలే దినకరన్‌ రూపంలో అన్నాడీఎంకేలో పరిస్థితులు గందరగోళంగా సాగుతుంటే, మైత్రేయన్‌ వ్యాఖ్యలు కేడర్‌ను మరింత విస్మయంలోకి నెట్టాయి. అదే సమయంలో అమ్మ జయలలితకు వెన్నంటి నీడలా ఉన్న జయ టీవీ మీద ఐటీ దాడుల్ని కేడర్‌ మరవక ముందే, తాజాగా, ఆ చానల్‌లో డీఎంకే సీనియర్‌ నేత దురై మురుగన్‌తో ప్రత్యేక ఇంటర్వూ్య సాగడాన్ని అన్నాడీఎంకే కేడర్‌ జీర్ణించుకోలేకపోతోంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు