కడుపు నొప్పని వస్తే...

5 Apr, 2018 16:46 IST|Sakshi

న్యూఢిల్లీ : షేషెంట్‌కు ఆపరేషన్‌ చేసి...కడుపులో కత్తెరలు, దూది మర్చిపోయిన సంఘటనలు అప్పుడప్పుడూ చూస్తూనే ఉన్నాం. అలాగే కొండ నాలుకకు మందు వస్తే ఉన్న నాలుక ఊడినట్లు.. కడుపునొప్పని వచ్చిన ఓ మహిళకు డయాలసిస్‌ చేశారు ఢిల్లీలోని ఎయిమ్స్‌ డాక్టర్లు. వివరాల్లోకి వెళితే బిహార్‌లోని సహర్స ప్రాంతానికి చెందిన రేఖాదేవి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం స్థానికంగా ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు ఆమె కడుపుకు శస్త్ర చికిత్స చేశారు. కానీ ఆ శస్త్ర చికిత్స సరిగా చేయకపోవడంతో రేఖాదేవి అప్పుడప్పుడు కడుపు నొప్పితో బాధపడుతుండేది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి వచ్చింది. అయితే ఇక్కడ వైద్యులు పొరపాటున ఆమెకు మూత్ర పిండాల వ్యాధి అని నోట్‌ చేసుకున్నారు. తదుపరి చికిత్స కోసం ఆమె మూత్రపిండాలను పరిక్షించారు. రిపోర్టుల్లో సమస్య ఏమి లేదని తెలిసిన తర్వాత కూడా ఆమెకు కిడ్నీ ఆపరేషన్‌ చేశారు. మరుసటి రోజు ఆమెకు డయాలసిస్‌ కూడా చేశారు.

తనకు కిడ్ని సమస్యలేదని  చెప్పినా కూడా డాక్టర్‌ వినలేదని వాపోయింది రేఖ. ఈ విషయం గురించి తనకు ఆపరేషన్‌ చేసిన డాక్టర్‌ను నిలదీయగా ఆ వైద్యుడు రిపోర్టును మార్చే ప్రయత్నం చేశాడని తన కుటుంబ సభ్యులకు తెలిపింది. విషయం తెలుసుకున్న రేఖ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేయడంతో ఎయిమ్స్‌ చైర్మన్‌ డా. వై కే గుప్తా విచారణ జరిపించడానికి ఒక కమిటీని వేశారు. ‘రేఖ, ఆమె తరుపున​ వచ్చిన వారి వివరాలు రోగుల రికార్డు బుక్‌లో నమోదవ్వలేదు. కానీ నర్సింగ్‌ రిపోర్టు బుక్‌లో మాత్రమే ఉన్నాయి. అందువల్ల డాక్టరు​ పొరపాటున కిడ్ని ఆపరేషన్‌ చేశాడు. కానీ పొరపాటును తెలుసుకుని మరుసటి రోజు దాన్ని సరిచేసే ప్రయత్నం చేశాడ’ ని కమిటీ ప్రాధమిక నివేదికలో తెలిసింది. దీంతో రేఖకు వైద్యం చేసిన డాక్టర్‌... వైద్య సేవలు చేయకుండా నిషేధం విధించారు.

>
మరిన్ని వార్తలు