నేనే బాధితుడిని; కావాలంటే సీసీటీవీ చూడండి!

12 Sep, 2019 15:12 IST|Sakshi

రాయ్‌పూర్‌ : తమ మహిళా సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఎయిర్‌ ఇండియా చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వినోద్‌ చంద్రాకర్ కొట్టిపారేశారు. ఎయిర్‌పోర్టులో జరిగిన ఘటనలో నిజానికి తానే బాధితుడినని..అయితే ఎయిర్‌ ఇండియా మాత్రం తనను దోషిగా చూపేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు తన పరువుకు నష్టం కలిగించేలా ప్రవర్తించిన ఎయిర్‌ ఇండియా యాజమాన్యంపై పరువు నష్టం దావా దాఖలు చేస్తానని తెలిపారు. అసలేం జరిగిందంటే...సెప్టెంబరు 7న కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వినోద్‌ చంద్రాకర్‌ తన స్నేహితులతో కలిసి రాంచి వెళ్లేందుకు రాయ్‌పూర్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో వారు ఎక్కాల్సిన విమానం టేకాఫ్‌ అయ్యింది.

దీంతో కోపోద్రిక్తుడైన వినోద్‌ అక్కడే ఉన్న ఓ మహిళా అధికారిణిపై సీరియస్‌ అయ్యారు. తాను అధికార పార్టీ ఎమ్మెల్యేనంటూ... గట్టిగా అరుస్తూ అసభ్య పదజాలంతో ఆమెను దూషించారు. ఆమె ఫోన్‌ లాక్కొని దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. ఫోన్‌ను దూరంగా విసిరేశారు. దీంతో పరిస్థితి చేయి దాటిపోతోందని గమనించిన తోటి సిబ్బంది తగిన భద్రత కల్పించి.. సదరు మహిళా అధికారిణిని రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వెనుక గేట్‌ నుంచి బయటికి పంపించారు. ఈ ఘటనతో తీవ్ర కలత చెందిన ఆమె అవమాన భారంతో అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయారు.

అనంతరం బాధితురాలు ఈ విషయాన్ని ఎయిర్‌ ఇండియా యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే ప్రవర్తనపై విచారణకు ఆదేశిస్తున్నట్లుగా ఎయిర్‌ ఇండియా బుధవారం తెలిపింది. ఈ నేపథ్యంలో విషయంపై స్పందించిన వినోద్‌ మాట్లాడుతూ...‘ నేనే ఫిర్యాదుదారుడిని. బాధితుడిని కూడా. కానీ విషయాన్ని వాళ్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎయిర్‌ ఇండియా స్టాఫ్‌ నాతో అనుచితంగా ప్రవర్తించారు. రెండుసార్లు నా బ్యాగేజ్‌ చెక్‌ చేసిన కారణంగా ఫ్లైట్‌ మిస్సయ్యాను. అప్పుడు నాతో పాటు నలుగురు స్నేహితులు కూడా ఉన్నారు. విమానాన్ని కొద్దిసేపు ఆపాల్సిందిగా కోరారు. నేను మహిళా అధికారిణితో అసభ్యంగా ప్రవర్తించాను అనేది అవాస్తవం. కావాలంటే సీసీటీవీ ఫుటేజీ చెక్‌ చేసుకోవచ్చు. విషయమేంటో వాళ్లకే అర్థమవుతుంది’అని పేర్కొన్నారు. అదే విధంగా ఎయిర్‌ ఇండియా సర్వీస్‌ ఇంత ఘోరంగా ఉంటుందనుకోలేదు. కస్టమర్లతో వారు పరుషంగా ప్రవర్తిస్తారు. జాతీయ రవాణా సంస్థ పరిస్థితి ఇదీ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా