అజిత్‌ పవార్‌ రాజీనామా

28 Sep, 2019 03:27 IST|Sakshi

సాక్షి, ముంబై: నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) సీనియర్‌ నాయకుడు అజిత్‌ పవార్‌ తన ఎమ్మెల్యే పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఈ రాజీనామాను అమోదించినట్లు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ హరిభౌ బగాడే తెలిపారు. అయితే ఆయన రాజీనామాకు కారణాన్ని మాత్రం స్పీకర్‌ వెల్లడించలేదు. ఎందుకు రాజీనామా చేస్తున్నారని ప్రశ్నించగా తర్వాత చెబుతానని అజిత్‌ తెలిపినట్లు స్పీకర్‌ చెప్పారు.   

ఈడీ కార్యాలయానికి వెళ్లని పవార్‌
మహారాష్ట్ర స్టేట్‌ కోఆపరేటిక్‌ బ్యాంకు కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ఈడీ కార్యాలయానికి హాజరవాలని తీసుకున్న నిర్ణయం నాటకీయ పరిణామాలకు దారి తీసింది. చివరి నిముషంలో ఈడీ కార్యాలయానికి వెళ్లాలన్న ఆలోచన ఆయన విరమించుకున్నారు. సమన్లు కూడా జారీ చేయకుండా శరద్‌ పవార్‌ హాజరైతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని భావించిన ముంబై పోలీసు కమిషనర్‌  సంజయ్‌ బార్వే స్వయంగా ఎన్సీపీ అధినేత నివాసానికి వెళ్లారు. ఈడీ కార్యాలయానికి వెళ్లవద్దని, అలా వెళితే  శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందని విజ్ఞప్తి చేశారు. దీంతో తన ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు పవార్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

మరిన్ని వార్తలు