‘రక్షణ ఒప్పందాల్లో వారు జోక్యం చేసుకోరు’

31 Dec, 2018 15:16 IST|Sakshi
సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ

సాక్షి, న్యూఢిల్లీ : యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీలు రక్షణ ఒప్పందాల్లో ఎన్నడూ జోక్యం చేసుకోలేదని రక్షణ శాఖ మాజీ మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ఏకే ఆంటోనీ పేర్కొన్నారు. బీజేపీ అసత్యాలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రక్షణ ఒప్పందాల్లో కుంభకోణాలపై బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న క్రమంలో ఆంటోనీ ఈ వ్యాఖ్యలు చేశారు. అగస్టా కేసులో మధ్యవర్తి క్రిస్టియన్‌ మైఖేల్‌ ఈడీ విచారణలో పరోక్షంగా సోనియా గాంధీ పేరును ప్రస్తావించారని వార్తలు రావడంతో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధానికి తెరలేచిన సంగతి తెలిసిందే.

 ఇక అగస్టాపై యూపీఏ ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని ఆంటోనీ గుర్తు చేశారు. బీజేపీ, ప్రభుత్వ సంస్థలు కలిసి కాంగ్రెస్‌పై ఆరోపణలు చేసేందుకు కట్టుకథలు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. కాగా అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ ప్రమోటర్లను కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం పనిచేస్తున్నాయని కాంగ్రెస్‌ ఆరోపించగా, అగస్టా ఒప్పందంలో దళారీ క్రిస్టియన్‌ మైఖేల్‌ను కాంగ్రెస్‌ పార్టీ వెనుకేసుకొస్తోందని బీజేపీ మండిపడింది. అగస్టా కేసుపై విచారణ అంటే కాంగ్రెస్‌ ఎందుకు భయపడుతోందని బీజేపీ ప్రశ్నించింది.

మరిన్ని వార్తలు