‘అక్కడ ఒక్క తూటా పేల్చలేదు’

15 Oct, 2019 10:26 IST|Sakshi

న్యూఢిల్లీ : ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం జమ్ము కశ్మీర్‌లో హింస ప్రజ్వరిల్లిందన్న వార్తలను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తోసిపుచ్చారు. జమ్ము కశ్మీర్‌లో సాధారణ పరిస్ధితులు నెలకొన్నాయని, క్షేత్రస్ధాయిలో శాంతియుత వాతావరణం ఉందని స్పష్టం చేశారు. 40,000 మంది మృత్యువాతన పడేందుకు ఆర్టికల్‌ 370 కారణమని పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్‌లో ఎక్కడా కర్ఫ్యూ లేదని, కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు లేవని, కేవలం ఆరు పోలీస్‌ స్టేషన్ల పరిధిలోనే సెక్షన్‌ 144 అమల్లో ఉందని చెప్పారు. యాపిల్‌ వ్యాపారం సజావుగా సాగుతోందని, మార్కెట్లు కూడా తిరిగి ప్రారంభమవుతున్నాయని తెలిపారు. మొబైల్‌ సేవలు, వాయిస్‌ కాల్స్‌ పునరుద్ధరించారని ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం తొలిసారిగా ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారు. జమ్ము, కశ్మీర్‌ రెండు డివిజన్లలోనూ ప్రశాంత వాతావరణం నెలకొందని అన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా 4000 మందిని నిర్బంధంలోకి తీసుకున్నారని, వీరిలో దాదాపు వేయి మంది జైళ్లలో ఉన్నారని చెప్పారు. వీరిలో 800 మందిని రాళ్లు విసురుతున్న ఘటనల్లో అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. జమ్ము కశ్మీర్‌ సమగ్రాభివృద్ధికి రోడ్‌మ్యాప్‌ రూపొందుతోందని చెప్పారు. ఆర్టికల్‌ 370 ఫలితంగా కశ్మీర్‌లో అభివృద్ధి కొరవడిందని ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు