అమిత్‌షా ఆస్తులు ఇంత పెరిగాయా..!

29 Jul, 2017 12:05 IST|Sakshi
అమిత్‌షా ఆస్తులు ఇంత పెరిగాయా..!
అహ్మదాబాద్‌ :  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన బల్వంత్‌సిన్హా రాజ్‌పుత్ శుక్రవారం రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేశారు. గుజరాత్ కోటా కింద ఖాళీ కానున్న మూడు స్థానాలకు బీజేపీ నుంచి ఈ ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్‌ కింద వీరు దాఖలు చేసిన అఫిడవిట్‌లో, ఈ ముగ్గురి ఆస్తులు భారీగా పెరిగినట్టు తెలిసింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా(ఆయన భార్యతో కలిపి) ఆస్తి అయితే ఏకంగా 2012 నుంచి 300 శాతం పైకి ఎగిసినట్టు తేలింది. అమిత్‌షా చరాస్తులు రూ.1.90 కోట్ల నుంచి రూ.19 కోట్లకు పెరిగాయి. అంతేకాక ఆయన స్థిరాస్తులు 2012లో రూ.6.63 కోట్లుంటే, 2017కి వచ్చేసరికి అవి రూ.15.30 కోట్లకు పెరిగినట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అయితే వీటిలో ఆయన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు రూ.10.38 కోట్లగా ఉన్నట్టు అమిత్‌షా తెలిపారు. 
 
అంతేకాక స్మృతీ ఇరానీ(ఆమె భర్తతో కలిపి) స్థిర, చరాస్తులు కూడా 2014లో రూ.4.91కోట్లుంటే, 2017కి వచ్చే సరికి అవి 80 శాతం పెరిగి రూ.8.88 కోట్లకు ఎగిశాయి. ఇరానీ ఆస్తులు అంతలా పెరగకపోయినప్పటికీ, ఆమె భర్త జుబిన్‌ ఆస్తుల విలువ మాత్రం భారీగా పెరిగినట్టు తెలిసింది. కాగ 2014లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆమె సమర్పించిన అఫిడవిట్‌లో యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ నుంచి కరెస్పాడెన్స్‌లో బీకామ్‌ పార్ట్‌1 పూర్తిచేసినట్టు తెలిపారు. తర్వాత ఆమె డిగ్రీపై పలు లీగల్‌ కేసులు నడిచాయి. ఈ సారి రాజ్యసభకు సమర్పించిన అఫిడవిట్‌లో మాత్రం ఆమె మూడేళ్ల డిగ్రీ కోర్సును పూర్తిచేయలేదని తెలిపారు. ప్రస్తుతం ఇరానీ టెక్స్‌టైల్‌ మంత్రిగా ఉన్నారు.  ఇక కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన బల్వంత్‌సిన్హా రాజ్‌పుత్ తన చరాస్తులు రూ.254 కోట్లగా, స్థిరాస్తులు రూ.62.56 కోట్లగా ఉన్నట్టు డిక్లేర్‌ చేశారు.    
మరిన్ని వార్తలు