ప్యూర్‌ వెజ్‌: వెజ్‌ మటన్‌ దోశ, వెజ్‌ చికెన్‌ దోశ!

7 Jan, 2020 12:45 IST|Sakshi

ఆనంద్‌ మహీంద్ర పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. నిత్యం వ్యాపార వ్యవహారాల్లో బిజీగా ఉండే మహీంద్ర గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ అయిన ఆయన.. సోషల్‌ మీడియాలో కూడా చురుగ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. సమకాలీన అంశాలను, సరదా ఫొటోలు, ఫన్నీ వీడియోలను షేర్‌ చేస్తూ.. తనదైన శైలిలో స్పందించే ఆయనకు సోషల్‌ మీడియాలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే. తాజాగా ఆయన తన ట్విటర్‌లో షేర్‌ చేసిన ‘ప్యూర్‌ వెజ్‌ స్పెషల్‌’ అని  ఉన్న ఓ రెస్టారెంట్‌ బోర్డు నెటిజన్లను ఆశ్యర్యానికి గురి చేస్తుంది. శాఖాహారులకు ప్రత్యేకమని రాసి ఉన్న స్టాండీ రెస్టారెంట్‌ బోర్డు.. మాంసాహారులను ఊరించేలా ఉంది. దీంతో ఈ భిన్నమైన వంటకాల జాబితా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
 

కాగా ఈ పోస్టుకు.. ‘ఇన్‌క్రెడిబుల్‌ ఇండియాకు నిజమైన ఉదాహరణ ఇదే.  మనస్సును, శక్తిని ఎలా ఉపయోగించాలో దశబ్ధాల నుంచి భారతీయులకు తెలిసిన విషయమే. అయినా శాఖాహారానికి, మంసాహారానికి మధ్య భేదం ఏంటనే అనే విషయంపై మనసులో ఇప్పటికీ స్పష్టత లేదు’ అంటూ మహీంద్ర క్యాప్షన్‌ జత చేశారు. ఇక రోడ్డు పక్కనే ఉన్న ఈ రెస్టారెంట్‌ బోర్డుపై ‘స్వచ్ఛమైన శాఖహారం’ అని రాసి.. దాని కింద ‘వెజ్‌ ఫిష్‌ ఫ్రై’, ‘వెజ్‌ మటన్‌ దోశ’, ‘వెజ్‌ చికెన్‌ దోశ’ అని రాసి ఉన్న ఈ జాబితాను చూసి నెటిజన్లంతా కంగుతింటున్నారు. ‘ఈ రెస్టారెంట్‌కు ఆవార్డు ఇవ్వాల్సిందే...  దీన్ని బట్టి పెట్రోల్‌ వేరియంట్‌  కారును మనం ఎలక్ట్రిక్‌ కారుగా మార్చుకోవాలంటే దాని ముందు ‘ఎలక్ట్రిక్‌’ పదాన్ని చేర్చితే సరిపోతుందన్న మాట!’  అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు