‘జేఎన్‌యూ దాడి మా పనే’

7 Jan, 2020 12:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ క్యాంపస్‌లో ఈనెల 5న జరిగిన ముసుగు దుండగుల భీకర దాడి తమ పనేనని  హిందూ రక్షా దళ్‌ ప్రకటించింది. జాతి విద్రోహ, హిందూ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నందునే ఆదివారం సాయంత్రం జేఎన్‌యూ క్యాంపస్‌లోకి హిందూ రక్షా దళ్‌ కార్యకర్తలు చొచ్చుకువెళ్లారని ఆ సంస్థ నేత భూపేంద్ర తోమర్‌ అలియాస్‌ పింకీ చౌదరి చెబుతున్న వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. మరోవైపు జేఎన్‌యూ క్యాంపస్‌లో ఇనుప రాడ్‌లతో వీడియోలో కనిపించిన సాయుధ దుండగులు ఇద్దరు ఆరెస్సెస్‌కు చెందిన విద్యార్థి సంఘ నేతలేనని ఏబీవీపీ ఢిల్లీ సంయుక్త కార్యదర్శి అనిమా సోంకర్‌ అంగీకరించిన నేపథ్యంలో ఈ ట్విటర్‌ వీడియో వెలుగుచూడటం గమనార్హం.

‘జేఎన్‌యూ కమ్యూనిస్ట్‌లకు హబ్‌లా మారింది..ఇలాంటి హబ్‌లను మేం సహంచం..వారు మా దేశాన్ని మతాన్ని దూషిస్తూన్నా’రని తోమర్‌ ఈ వీడియోలో వ్యాఖ్యానించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలు తలపెడితే ఇతర యూనివర్సిటీల్లోనూ ఇవే చర్యలు పునరావృతమవుతాయని ఆయన హెచ్చరించారు. జేఎన్‌యూ విద్యార్ధులు ఈ దేశంలో నివసిస్తూ ఇక్కడి తిండి తింటూ వర్సిటీలో చదువుకుంటూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జేఎన్‌యూ దాడి ఘటనలో పాల్గొన్నది తమ కార్యకర్తలేనని, దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు.మరోవైపు తోమర్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఈ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ముసుగు దుండగులను గుర్తించేందుకు వీడియో ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. జేఎన్‌యూ క్యాంపస్‌లోకి ఆదివారం సాయంత్రం చొచ్చుకువచ్చిన ముసుగు దుండగులు విచక్షణారహితంగా విద్యార్ధులు,ఉపాధ్యాయులను చితకబాదిన ఘటనలో 30 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే.

చదవండి : ఆ రోజుల్లో తుక్డే-తుక్డే గ్యాంగ్‌ను చూడలేదు: కేంద్ర మంత్రి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా