వ్యాజ్యాలకు ముందే మధ్యవర్తిత్వం

9 Feb, 2020 05:56 IST|Sakshi
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే

 పెండింగ్‌ కేసులు తగ్గుతాయి

సీజేఐ జస్టిస్‌ బాబ్డే

న్యూఢిల్లీ: వ్యాజ్యం దాఖలు కంటే ముందే మధ్యవర్తిత్వం జరిగేలా ‘తప్పనిసరి మధ్యవర్తిత్వ చట్టం’ తీసుకురావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే చెప్పారు. ‘ప్రపంచీకరణలో మధ్యవర్తిత్వ పాత్ర’ అన్న అంశంపై శనివారం ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ సదస్సు మూడవ ఎడిషన్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. వ్యాజ్యం దాఖలుకు ముందే మధ్యవర్తిత్వం జరిగితే కోర్టు తీర్పుల నాణ్యత పెరుగుతుందని, పెండింగ్‌ కేసుల సంఖ్య తగ్గుతుందని చెప్పారు.

మధ్యవర్తిత్వానికి సంబంధించిన ‘ఆర్బిట్రరీ బార్‌’ భారత్‌లో తయారు చేయడం క్లిష్టమైన ప్రక్రియ అని, దీనికి అనుభవంతో పాటు విషయ పరిజ్ఞానం కలిగిన లాయర్లు అవసరమవుతారని చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యం, కామర్స్, ఇన్వెస్ట్‌మెంట్‌ వంటి వాటిలో మధ్యవర్తిత్వం మౌలిక అంశమని పేర్కొన్నారు. సరిహద్దులు దాటి వాణిజ్యం జరుగుతున్న ఈ రోజుల్లో మధ్యవర్తిత్వం అత్యవసరమని తెలిపారు. మధ్యవర్తిత్వం కంటే రాజీ కుదర్చడం ఇంకా ఉత్తమమైనదని చెప్పారు. వాణిజ్య న్యాయస్థాన కోర్టుల చట్టం కూడా మధ్యవర్తిత్వం గురించి, సెటిల్‌మెంట్‌ గురించి చెప్పిందన్నారు.

మరిన్ని వార్తలు