స్కిల్‌ స్కాం కేసులో నేడు అత్యంత కీలకం?!

7 Nov, 2023 19:23 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో నేడు అత్యంత కీలక పరిణామం చోటు చేసుకోనుందా?. ఈ కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై బుధవారం సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులోనే చంద్రబాబును ఏపీ నేర దర్యాప్తు విభాగం (క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌-సీఐడీ) అరెస్ట్‌ చేసింది. సెప్టెంబర్‌ 09వ తేదీ నుంచి 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. చివరకు.. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఏపీ హైకోర్టు ఈ కేసులో నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ మీద బయటకు వచ్చారు. 

అయితే ఈ కేసులో తనపై సీఐడీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని చంద్రబాబు తొలుత ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అక్కడ ఆయనకు చుక్కెదురైంది. ఆ వెంటనే చంద్రబాబు ఆలస్యం చేయకుండా వెంటనే సుప్రీం కోర్టులో తన లాయర్లతో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేయించారు. తన అరెస్ట్‌ అక్రమమని, సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని క్వాష్‌ పిటిషన్‌ ద్వారా సుప్రీంను అభ్యర్థించారాయన. అయితే అప్పటికే స్కిల్‌ కేసు కీలక దర్యాప్తు దశలో ఉండడంతో.. ఆ పిటిషన్‌ను సుప్రీం విచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. చివరకు ఉత్కంఠకు తెర దించుతూ ఆ పిటిషన్‌ను విచారణకు చేపట్టింది ద్విసభ్య ధర్మాసనం. 

క్వాష్‌ పిటిషన్‌పై విచారణ సమయంలో.. చంద్రబాబు అరెస్ట్‌ అక్రమమని, ఆయనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ(అరెస్టుకు గవర్నర్‌ అనుమతి అవసరం) వర్తిస్తుందని ఆయన తరఫు లాయర్లు వాదించారు. ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇది రాజకీయ కక్ష చర్యగా వాదించారాయన. అయితే.. స్కిల్‌ స్కామ్‌ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్‌ లేదని, పైగా నిజాయితీగల ప్రజాప్రతినిధులకు మాత్రమే ఈ సెక్షన్‌ వర్తిస్తుందని.. చంద్రబాబుకి ఈ సెక్షన్‌ వర్తించదని ప్రభుత్వం తరఫున సీనియర్‌ లాయర్‌ ముకుల్‌ రోహత్గీ వాదించారు. ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అరెస్ట్‌ చేసిన ఐదు రోజులకే క్వాష్‌ పిటిషన్‌ వేయడం అత్యంత తొందరపాటు చర్య అని, కేసు ట్రయల్‌ దశలో ఉన్నప్పుడు సెక్షన్‌ 482 ద్వారా క్వాష్‌ కోరడం సరికాదని రోహత్గీ వాదించారు. 

ఇదీ చదవండి:  స్కిల్‌ స్కాం.. అంతా బాబుగారి కనికట్టు

ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. నవంబర్‌ 20వ తేదీన క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ చేస్తున్నట్లు పేర్కొంది. అదే సమయంలో స్కిల్‌ కేసులో చంద్రబాబు వయసు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మధ్యంతర బెయిల్‌ కోరారు చంద్రబాబు లాయర్లు. మరోవైపు ఫైబర్‌నెట్‌ కేసులో ఇదే బెంచ్‌ ముందు చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకున్నారు. అయితే.. స్కిల్‌ స్కాంలో క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు వెల్లడించిన తర్వాతే ఫైబర్‌నెట్‌ కేసు పిటిషన్‌ విచారణ చేపడతామని బెంచ్‌ చంద్రబాబు లాయర్లకు స్పష్టం చేసింది. ఫైబర్‌నెట్‌ పిటిషన్‌ను నవంబర్‌ 8వ తేదీకి వాయిదా వేసిన కోర్టు.. అదే రోజున స్కిల్‌ స్కాం పిటిషన్‌ తీర్పు వెల్లడిస్తామని చెప్పింది. ఈలోపు చంద్రబాబు లాయర్ల విజ్ఞప్తితో నవంబర్‌ 09కి ఫైబర్‌నెట్‌ కేసు విచారణ వాయిదా వేసిన ధర్మాసనం.. నవంబర్‌ 8వ తేదీన(రేపు) చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు వెల్లడిస్తామని ఇరుపక్షాలకు తెలిపింది.  

స్కిల్‌ స్కాంలో.. 
టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకో­ణం కేసు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ ఇస్తామంటూ ఘరానా మోసానికి పాల్పడ్డారని, షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి రాగా, 2017-2018లో నకిలీ ఇన్‌వాయిస్‌లతో అవినీతి బాగోతం బయటపడింది. అయితే అప్పటికే జీఎస్టీ అధికారులు అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోలేదు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు­నాయుడే ప్రధా­న సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది.

కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్‌మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పింర్పించింది కూడా. మరోవైపు ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురిని అరెస్ట్ చేసింది కూడా. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడి పేరు నమోదు అయ్యింది. చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు అయ్యాయి. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెఓంబర్‌ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేసింది.ఆపై ఏసీబీ కోర్టు ఐదు పర్యాయాలు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగించగా.. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా 7691 నెంబర్‌తో 52 రోజులపాటు చంద్రబాబు ఉన్నారు. అయితే కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్‌ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. 

మరిన్ని వార్తలు