సొంత చాపర్‌లో గర్భిణిని ఆస్పత్రికి చేర్చిన గవర్నర్‌

30 Nov, 2018 11:03 IST|Sakshi

ఇటానగర్‌: ఓ గర్భిణి కష్టాన్ని చూసి చలించిపోయారు అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బీడీ మిశ్రా. గర్భిణి ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలుసుకున్న మిశ్రా.. తన సొంత చాపర్‌లో ఆమెను ఆస్పత్రికి చేర్చి సకాలంలో వైద్యం అందేలా చేశారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం మధ్యహ్నం మిశ్రా, అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూతో కలిసి తవాంగ్‌లో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఓ గర్భిణి పరిస్థితి విషమంగా ఉందని ఆమెను తవాంగ్‌ నుంచి ఇటానగర్‌కు తరలించడానికి హెలికాఫ్టర్‌ సర్వీస్‌లు కూడా అందుబాటులో లేవని స్థానిక ఎమ్మెల్యే సీఎంతో చెప్పారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మిశ్రా.. ఆ గర్భిణిని, ఆమె భర్తను తన హెలికాఫ్టర్‌లో ఇటానగర్‌కు తీసుకెళ్లడానికి ముందుకొచ్చారు. అందుకోసం ఆయనతో పాటు ఉన్న అధికారుల్లో ఇద్దరి ప్రయాణాన్ని నిలిపివేశారు.

అయితే మార్గమధ్యలో వారికి అవాంతరం ఎదురైంది. హెలికాఫ్టర్‌ అస్సాంలోని తేజ్‌పూర్‌లో ఇంధనం నింపుకుని బయలుదేరే సమయంలో టేకాఫ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. గర్భిణి పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని గమనించిన గవర్నర్‌ అక్కడి ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులతో మాట్లాడి.. గర్భిణికి, ఆమె భర్తను ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఇటానగర్‌కు తరలించారు. ఆ తర్వాత మరో హెలికాఫ్టర్‌లో గవర్నర్‌ రాజ్‌భవన్‌కు బయలుదేరారు. అంతేకాకుండా రాజ్‌భవన్‌ హెలిప్యాడ్‌లో గర్భిణి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ ల్యాండ్‌ కాగానే.. అక్కడ అంబులెన్స్‌తో పాటు, ఓ మహిళ వైద్యురాలిని అందుబాటులో ఉండేలా మిశ్రా ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో ఆమెను హిమా ఆస్పత్రికి తరలించారు. అక్కడ అత్యవసర సిజేరియన్‌ ఆపరేషన్‌ ద్వారా ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మిశ్రా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

అయితే.. తవాంగ్‌ నుంచి ఇటానగర్‌ మధ్య దూరం 200 కిలోమీటర్లు అయిప్పటికీ.. కొండ ప్రాంతం కావడంతో ప్రయాణ సమయం 15 గంటల పడుతుంది. కానీ గవర్నర్‌ చూపిన చొరవ వల్ల ఆ గర్భిణికి రెండు గంటల్లోనే వైద్యం అందింది. 

మరిన్ని వార్తలు