‘పిచ్చి అల్లర్లను వెంటనే ఆపేయాలి’

25 Feb, 2020 18:27 IST|Sakshi

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) పై ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో గాయపడిన వారిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం పరామర్శించారు. ఈ అల్లర్లలో గాయపడిన వారిని ఢిల్లీలోని జీటీబీ, మాక్స్‌ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా అల్లర్లలో గాయపడిన బాధితులను కలిశారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ‘ఈ ఘర్షణ చోటు చేసుకున్న ప్రాంతంలో ఎవరు గాయపడకుండా తప్పించుకోలేదు. హిందువులు, ముస్లింలు, పోలీసులు అందరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ పిచ్చి అల్లర్లను వెంటనే ఆపేయాలి’ అని సీఎం కేజ్రీవాల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. (అమిత్‌ షా సానుకూలంగా స్పందించారు : కేజ్రీవాల్‌)

ఈ అల్లర్లు పౌరసత్వం సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణలో ఇప్పటివరకూ ఒక హెడ్‌ కానిస్టేబుల్‌ సహా ఏడుగురు మరణించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. నిరసనలు తలెత్తిన ప్రాంతంలో చర్యలు తీసుకువడంపై అమిత్‌ షా సానుకూలంగా స్పందించినట్లు కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు