ఆత్రేయీ మజుందార్‌ కోసం సెర్చ్‌ ఆపరేషన్‌

11 Apr, 2018 10:33 IST|Sakshi

బెంగుళూరు : గత వారం అదృశ్యమైన బెంగుళూరుకు చెందిన ఆంత్రోపాలజిస్ట్ ఆత్రేయీ మజుందార్‌ (35) కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆమె ఆచూకీ కోసం స్నేహితులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలిస్తున్నారు. అందుకోసం వారు గూగుల్‌ స్ప్రెడ్‌ షీట్స్‌ను కూడా వాడుతున్నారు. కెనడాలో పీహెచ్‌డీ చేస్తున్న మజుందార్‌ ఏప్రిల్‌ 4న బెంగుళూరులోని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఇంటికి వచ్చిన అనంతరం తన గదిలోకి వెళ్లి రాత్రి తొమ్మిది గంటల వరకూ నిద్రపోయింది.

తర్వాత తన గది నుంచి బయటకు వచ్చి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. నాటి నుంచి ఈ రోజు వరకూ ఆమె ఆచూకీ తెలియలేదు. కాగా మజుందార్‌ కనిపించకుండా పోవడానికి ఒక్క రోజు ముందు తల్లిదండ్రులు ఆమెకు ఫోన్‌ చేశారు. కానీ ఆమె వారితో సరిగా మాట్లడలేదు.  మరుసటి రోజు ఆమె తాను ఢిల్లీలో ఉన్నట్లు తండ్రితో చెప్పింది. ఆమెను బెంగుళూరు రమ్మని తండ్రి సూచించినా కుమార్తె ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్రేయీ మజుందార్‌ బెంగళూరులోని బెల్లందూర్‌లో బస చేసిన నోవాటెల్‌, మారియట్‌ హోటల్‌ నుంచి సీసీటీవీ ఫూటేజ్‌ తెప్పించి పరిశీలించారు. మజుందర్‌ హోటల్‌ నుంచి బయటకు వెళ్లేటప్పుడు తనతో పాటు పాస్‌పోర్టు, డబ్బులను మాత్రమే తీసుకెళ్లింది. ఫోన్‌ను హోటల్‌లోనే వదిలేసి వెళ్లినట్లుగా తెలిసింది. మజుందార్‌ తల్లిదండ్రులు, ఆమె స్నేహితులు సోషల్‌ మీడియాలో ఆమె ఫోటోను షేర్‌ చేసి ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక బెంగళూరులోని నేషనల్‌ లా కాలేజీలో చదువుకున్న మజుందార్‌ ప్రస్తుతం పీహెచ్‌డీ చేయడానికి టోరంటో వెళ్లింది. ఆమె ఆచూకీ తెలిసిన వారు ఈ కింది నంబర్లను సంప్రదించవలసిందిగా కోరుతున్నారు. 9845261515, 9448290990 

మరిన్ని వార్తలు