మోదీ చెప్పిందే.. వాళ్లు చేశారు

5 Feb, 2018 08:39 IST|Sakshi
ప్రధాని నరేంద్ర మోదీ(ఫైల్‌ ఫోటో) ఇన్‌సెట్‌లో విద్యార్థులు పకోడా అమ్ముతున్న దృశ్యం

సాక్షి, బెంగళూరు : ఓవైపు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగిన వేళ.. నగరంలో కొందరు విద్యార్థులు చేసిన పని అందరి దృష్టిని ఆకర్షించింది. మోదీ ‘పకోడా’ వ్యాఖ్యలను అనుసరించి రోడ్లపైకి చేరిన కొందరు పకోడా అమ్ముతూ కనిపించారు. ఉద్యోగ కల్పనలో కేంద్రం విఫలమవుతోందన్న కథనాలపై ఓ మీడియా ఛానెల్‌ ఇంటర్వ్యూలో ప్రధాని స్పందిస్తూ.. ‘పకోడా అమ్ముకోవటం కూడా ఉద్యోగ కల్పనలో భాగమే. రోజుకు 200రూ. సంపాదించినా నిరుద్యోగ సమస్యను రూపుమాపినట్లే కదా’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం బెంగళూరు పర్యటనకు వచ్చిన మోదీకి నిరసన తెలిపే ఉద్దేశంతో కొందరు విద్యార్థులు ఈ ఆలోచన చేశారు. 

మెహ్‌క్రి సర్కిల్‌ వద్ద చేరుకుని ర్యాలీ వెళ్లే వారిని అడ్డుకుని ఇలా పకోడా అమ్ముతూ కనిపించారు. ‘మోదీ పకోడా, అమిత్‌ షా పకోడా, వై రెడ్డి(యాడ్యురప్ప) పకోడా’ అంటూ వాటికి పేర్లు పెట్టి మరీ అమ్మసాగారు. ట్రాఫిక్‌ కు అంతరాయం కలగటంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు