తెల్లారిన బతుకులు

5 Feb, 2018 08:28 IST|Sakshi
విలపిస్తున్న ఖాజాహుసేన్‌ తల్లి, భార్య, బంధువులు

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం

ముగ్గురు చిందీ వ్యాపారులు దుర్మరణం

పామిడి పట్టణంలో మరో విషాదం

రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలు వారివి. ఇంట్లో పెద్దలు చిందీలను సఫాయి చేయాలి.. ఆడబిడ్డలు నైటీలు, లంగాలు, జుబ్బాలు, నైట్‌ ప్యాంట్‌లో.. ఇలా ఏవి అందుబాటులో ఉంటే వాటిని కుట్టి తీరాలి. మగవారు ర్యాగ్స్‌ కటింగ్‌తో దుస్తుల తయారీకి సహకరించాలి. ఇలా కుటుంబసభ్యులందరూ శ్రమిస్తే తప్ప పూట గడవని దుర్భర జీవితాలు. కాసింత నాలుగు పైసలు కళ్లతో చూడాలనుకుంటే ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయించాలి. బతుకు పోరులో అలుపెరగని శ్రమజీవులపై విధి వింత పాచిక విసిరింది. పొరుగున ఉన్న రాష్ట్రంలో దుస్తులు విక్రయించేందుకు వెళుతున్న వారి బతుకులు చీకట్లు వీడకముందే రోడ్డు ప్రమాదంతో తెల్లారిపోయాయి. పామిడికి చెందిన ముగ్గురు వ్యాపారులు దుర్మరణం చెందారు. డిసెంబర్‌లో జరిగిన పోలీస్‌ బ్రదర్స్‌ మరణం నుంచి కోలుకోకముందే మరో విషాదం పామిడి వాసులను విషాదంలో ముంచెత్తింది.  

పామిడి: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిందీ వ్యాపారులు ముగ్గురు మృత్యువాత పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. బెంగళూరులోని రామనగర్‌లో జరుగుతున్న ఇజ్తెమాలో జుబ్బాలు, నైట్‌ ప్యాంట్లు విక్రయించడం కోసం పామిడికి చెందిన 11మంది ముస్లిం వ్యాపారులు శనివారం రాత్రి పదిన్నర గంటలకు అనంతపురానికి చెందిన మహీంద్రా బొలెరో వాహనంలో బయల్దేరారు. ఆదివారం వేకువజామున 3.30 గంటలకు చిక్‌బళ్లాపూర్‌ దాటి పది కిలోమీటర్లు వెళ్లగానే వెనుకచక్రం బరెస్ట్‌ కావడంతో బొలెరో వాహనం పల్టీలు కొట్టింది.

ట్రాలీలో కూర్చున్న నెహ్రూకాలనీ వాసి ఎన్‌.ఖాదర్‌వలి (38), బొడ్రాయి వీధికి చెందిన అనుంపల్లి ఖాజాహుసేన్‌ (42)లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన షేక్‌ ఇబ్రహీం (48)ను హుటాహుటీన బెంగుళూరులోని ప్రో లైఫ్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం ఇబ్రహీం మృతి చెందాడు.ఇదే ప్రమాదంలో షెక్షావలి, రసూల్, శింగనమల మహమ్మద్, తరిమెల హాజీవలి, దేవరపల్లి బాషా గాయాలపాలయ్యారు. క్యాబిన్‌లో కూర్చున్న డీఎం బాషా, షేక్‌ జాఫర్, హన్నూ సురక్షితంగా బయటపడ్డారు. 

మృతుడు ఖాదర్‌వలికి భార్య యాస్మిన్, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అనుంపల్లి ఖాజాహుసేన్‌కు భార్య ఫకృన్నీ, ఇద్దరు కుమారులు, షేక్‌ ఇబ్రహీమ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.  
ఆదివారం సాయంత్రం పామిడికి చేరుకున్న ఎన్‌.ఖాదర్‌వలి, ఖాజాహుసేన్‌ల మృతదేహాలకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. షేక్‌ ఇబ్రహీం మృతదేహం ఆదివారం రాత్రికి వచ్చింది. సోమవారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.  

కూతురు వద్దన్నా వెళ్లి..  
ఇజ్తెమాకు వెళుతున్న ఖాదర్‌వలిని మూడేళ్ల కూతురు వెళ్లొద్దంటూ అడ్డుపడింది. పాపను సముదాయించి బయల్దేరిన ఖాదర్‌వలి రోడ్డుప్రమాదంలో మరణించడం కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పుడే నూరేళ్లు నిండినా అంటూ తల్లి, భార్య, సోదరులు రోదించడం చూపరుల హృదయాలను కలచివేసింది.

వెంటాడిన మృత్యువు..
ఖాజాహుసేన్‌ గత రంజాన్‌ మాసంలో చిందీ వ్యాపారం కోసం బళ్లారికి ద్విచక్రవాహనంలో వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. కాలు విరిగింది. కుటుంబ పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో శనివారం రాత్రి బెంగళూరుకు వెళుతుండగా రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. మరణవార్త తెలియగానే తల్లి జహీరాబీ, భార్య ఫకృన్నీ గుండెలవిసేలా రోదించారు.

తనయుడి ఎదుటే తండ్రి మరణం
షేక్‌ ఇబ్రహీంకు తనయుడు షేక్‌ జాఫర్‌ వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉండేవాడు. బెంగళూరుకు తండ్రితోపాటు బయల్దేరాడు. రోడ్డు ప్రమాదంలో తనయుడి కళ్లెదుటే ఇబ్రహీమ్‌ ప్రాణాలు విడిచాడు. ఆ బాధ నుంచి జాఫర్‌ కోలుకోలేదు. కుటుంబ యజమాని మృతితో తామెట్ల బతికేదంటూ ఇబ్రహీం భార్య గుల్జార్‌ విలపించింది.

మరిన్ని వార్తలు