మోదీతో మమత బెనర్జీ భేటీ

18 Sep, 2019 17:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీ సమావేశమయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో బుధవారం ఇద్దరు సమావేశమయ్యారు. మోదీ మంగళవారం తన 69వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మమత తన తరఫున మోదీకి ప్రత్యేక కుర్తా, బెంగాలీ స్వీట్స్‌ను బహుకరించారు. మోదీకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భేటీ అనంతరం మమత మాట్లాడుతూ.. తమ మధ్య సమావేశం సంతోషకరంగా జరిగిందన్నారు. బెంగాల్‌ రాష్ట్ర పేరు మార్పులో ప్రధాని సానుకూలంగా స్పందించారని ఆమె పేర్కొన్నారు. 

అలాగే వీరిద్దరి భేటీ సందర్భంగా పలు అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పలు సమస్యలు, ఎన్‌ఆర్‌సీ గురించి మమత ప్రధాని దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. కాగా ప్రధానిగా మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరవాత వీరిద్దరి మధ్య భేటీ జరగడం​ ఇదే తొలిసారి కావడంతో, వారి భేటీపై ఆసక్తినెలకొంది. బీజేపీని అన్ని విషయాల్లో విమర్శించే మమత అకస్మాత్‌గా మోదీతో భేటీతో రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి అలాగే జూన్‌లో జరిగిన నీతిఅయోగ్‌ సమావేశానికి కూడా మమత గైర్హాజరు అయిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు