Parliament: రాజ్యసభ నుంచి ఎంపీ సస్పెండ్‌

14 Dec, 2023 13:23 IST|Sakshi

ఢిల్లీ: పార్లమెంట్‌ భద్రత వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా జవాబు చెప్పాలని తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు స్లోగన్స్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు. పార్లమెంట్‌లో బుధవారం చోటచేసుకున్న ఘటనపై కేంద్ర మంత్రి ఆమిత్ షా స్పందించాలని రాజ్యసభలో టీఎంసీ ఎంపీలు పట్టుబాట్టారు. ఈ క్రమంలో టీఎంసీ ఎంపీ  డెరెక్‌ ఒబ్రయిన్‌పై వేటు పడింది. ఆయనను సస్పెండ్‌ చేసినట్లు రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ప్రకటించారు. రాజ్యసభలో ‘వికృతమైన ప్రవర్తన’కు గాను ఎంపీ డెరెక్‌ను ఈ పార్లమెంట్‌ శీతాకాల సమాశాలకు సస్పెన్షన్ విధించినట్లు వెల్లడించారు.

అమిత్‌ షా జవాబు ఇవ్వాలని.. ఆందోళన చేపట్టిన డెరెక్ ఓబ్రెయిన్ వెంటనే రాజ్యసభను వదిలి వెళ్లాలని రాజ్యసభ ఛైర్మన్‌ ఆదేశించారు. ఎంపీ డెరెక్... రాజ్యసభ చైర్‌ను ధిక్కరించారని, సభ నియమ నిబంధనలు ఉల్లంగించారని అన్నారు. ఇది తీవ్రమైన దుష్ప్రవర్తన కిందకు వస్తుందని.. సిగ్గు పడాల్సిన ఘటన అని  ఆయన్ను సెస్పెండ్‌ చేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ తెలిపారు. ఈ సస్పెన్షన్‌ వేటు..  శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు కొనసాగుతోందని తెలిపారు.

మరోవైపు.. పార్లమెంటులో అడుగడుగునా ఆంక్షలు విధించారు. లోక్‌సభలో పార్లమెంట్‌ భద్రత వైఫల్యంతో సిబ్బంది.. ప్రతిబంధకాలు విధించింది. పార్లమెంటుకు వెళ్లే అన్ని మార్గాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ పోలీస్, ప్యారా మిలిటరీ, పార్లమెంటు స్పెషల్ సెక్యూరిటీ గార్డులతో పహార  ఏర్పాటు చేశారు. సందర్శకుల అన్ని రకాల పాసులు రద్దు చేశారు. ఎంపీలు ప్రవేశించే మకర ద్వారం వద్ద వంద మీటర్ల దూరంలో ఉండాలని మీడియాపై ఆంక్షలు విధించారు. ఈ ఘటనలో ఇప్పటికే దాదాపు ఎనిమిది మందిని పార్లమెంట్ సెక్రటేరియట్  సస్పెండ్ చేసింది. ఈ ఘటనకు పాల్పడిన వారిని  ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. భద్రతా వైఫల్యంపై  హోం మంత్రి అమిత్‌ షా జవాబు చెప్పాలని విపక్షాల డిమాండ్ చేస్తున్నాయి.

చదవండి: Parliament: నీలం ఆజాద్‌ ‘ఆందోళన జీవీ’: బీజేపీ ఎంపీ

>
మరిన్ని వార్తలు