మణిపూర్‌ సీఎంగా బీరేన్‌

14 Mar, 2017 03:02 IST|Sakshi
మణిపూర్‌ సీఎంగా బీరేన్‌

బీజేపీ శాసనసభాపక్ష నేతగాఎన్నిక
ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి కాషాయదళంలో చేరిన బీరేన్‌
హైడ్రామా నడుమ ఇబోబీ రాజీనామా


ఇంఫాల్‌: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో తొలి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రిగా రాష్ట్ర మాజీ మంత్రి నాంగ్‌తోంబం బీరేన్‌ సింగ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. సోమవారం సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు ఆయనను తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ విషయాన్ని పార్టీ నేతలైన కేంద్రమంత్రులు ప్రకాశ్‌ జవదేకర్, పీయూష్‌ గోయల్‌లు మీడియాకు తెలిపారు. తర్వాత బీరేన్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ నజ్మాహెప్తుల్లాను కోరారు. కాంగ్రెస్‌ కేబినెట్‌లో పదేళ్లు పనిచేసిన 56 ఏళ్ల బీరేన్‌ గత ఏడాది అక్టోబర్‌లో ఆ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

మణిపూర్‌కు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి, బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నానని ఆయన అన్నారు. ‘కాంగ్రెస్‌ దుష్పరిపాలనకు నిరసనగా ఆ పార్టీ నుంచి బయటకొచ్చాను. మోదీ నాయకత్వంలో సుపరిపాలన అందిస్తామని హామీ ఇస్తున్నా’ అని విలేకర్లతో చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 28, బీజేపీకి 21 సీట్లు దక్కడం తెలిసిందే. తమకు 32 మంది ఎమ్మెల్యేల మద్దతుందని బీజేపీ నేతలు ఆదివారం గవర్నర్‌కు చెప్పారు. చెరో నలుగురేసి ఎమ్మెల్యేలున్న నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ), నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌(ఎన్‌పీఎఫ్‌)తోపాటు ఒక లోక్‌జనశక్తి ఎమ్మెల్యే, ఒక తృణమూల్‌ ఎమ్మెల్యే, ఒక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బీజేపీకి మద్దతిస్తున్నారు.

తొలి అవకాశం నాకివ్వాలి: ఇబోబీ
ప్రభుత్వ ఏర్పాటుకు ప్రస్తుత సీఎం, కాంగ్రెస్‌ నేత ఇబోబీ సింగ్‌ కూడా తీవ్రంగా యత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన హైడ్రామా నడుమ సోమవారం రాత్రి సీఎం పదవికి రాజీనామా చేసి, రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేశారు. అంతకుముందు.. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పెద్ద పార్టీగా అవతరించింది కనుక ప్రభుత్వ ఏర్పాటుకు తొలి అవకాశం తనకే ఇవ్వాలని, తనకు మెజారిటీ ఉందని, బలపరీక్షకు సిద్ధమని అన్నారు. అయితే, ఆయన రాజీనామా చేయాలని, ఆ తర్వాతే ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తానని గవర్నర్‌ స్పష్టం చేయడంతో ఇబోబీ దిగొచ్చి మంగళవారం రాజీనామా చేస్తానన్నారు.

మారిన పరిణామాలతో సోమవారమే రాజీనామా చేశారు. ఇబోబీ, ఇతర కాంగ్రెస్‌ నేతలు ఆదివారం రాత్రి గవర్నర్‌ను కలిశారని రాజ్‌భవన్‌ వర్గాలు చెప్పాయి. ‘ఇబోబీ 28 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల జాబితా అందజేసి, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. తమకు ఎన్‌పీపీ మద్దతిస్తోందంటూ ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల పేర్లున్న కాగితం ఇచ్చారు. అయితే దాన్ని మద్దతు లేఖగా పరిగణించలేనని, ఆ నలుగురితోపాటు ఎన్‌పీపీ అధ్యక్షుణ్ని  తీసుకురావాలని గవర్నర్‌ చెప్పారు’ అని వెల్లడించాయి.

ఎడిటర్, ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు
మణిపూర్‌ అధికార పగ్గాలు చేపట్టనున్న బీరేన్‌ మాజీ పత్రికా సంపాదకుడు, జాతీయస్థాయి ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు కూడా. నహరోల్గి థౌండాగ్‌(యువత పాత్ర) అనే స్థానిక దినపత్రికకు ఆయన సంపాదకుడిగా పనిచేశారు. 2002లో డెమోక్రటిక్‌ రివల్యూషనరీ పార్టీ తరఫున హీన్‌గాగ్‌ స్థానం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి ఇబోబీ మంత్రివర్గంలో పదేళ్లు(2003–2012) పనిచేశారు. బీరేన్‌ కొడుకు అజయ్‌ ఒక విద్యార్థిని కాల్చిచంపడంతో 2012లో ఏర్పడిన కాంగ్రెస్‌ కేబినెట్‌లో ఆయనకు చోటు దక్కలేదు. ఇబోబీని పలు అంశాల్లో తీవ్రంగా వ్యతిరేకించిన బీరేన్‌ గత ఏడాది అక్టోబర్‌లో బీజేపీలో చేరారు.

మరిన్ని వార్తలు