సీఎంల విషయంలో బీజేపీది అదే సంప్రదాయం

18 Mar, 2017 20:51 IST|Sakshi
సీఎంల విషయంలో బీజేపీది అదే సంప్రదాయం

ముఖ్యమంత్రిగా రాజ్‌పూత్‌(రాజపుత్ర) యోగీ ఆదిత్యనాథ్‌ను ఎంపికచేయడం ద్వారా 1991 నుంచీ ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎంల విషయంలో తాను అనుసరిస్తున్న సంప్రదాయాన్నే(బ్రాహ్మణేతర నేతలకు సీఎం పదవి) బీజేపీ కొనసాగించినట్టయింది. మొదటి సీఎం కల్యాణ్‌సింగ్‌ బీసీ వర్గమైన లోధా కుటుంబంలో జన్మించగా, తర్వాత వచ్చిన కాషాయ  ముఖ్యమంత్రులు రాంప్రకాశ్‌ గుప్తా, రాజ్‌నాథ్‌సింగ్‌(ఠాకూర్‌ లేదా రాజ్‌పూత్‌) ఇద్దరూ అగ్రవర్ణాలవారే. అయితే, బ్రాహ్మణాధిపత్యం ఎక్కువనే ప్రచారం ఉన్న బీజేపీ హిందూ అగ్రవర్ణాల్లో అధిక జనాభా, రాజకీయాధిపత్యం ఉన్న బ్రాహ్మణులకు ఇంత వరకు ఇక్కడ సీఎం పదవి ఇవ్వకపోవడం విశేషమే.

1946 నుంచీ  కాంగ్రెస్‌ తరఫున పది మంది నేతలు యూపీ ముఖ్యమంత్రి పదవి చేపడితే, వారిలో ఆరుగురు (పండిత గోవిందవల్లభ్‌ పంత్, సుచేతా కృపలాణీ, కమలాపతి త్రిపాఠీ, హెచ్‌ఎన్‌ బహుగుణ, ఎన్‌డీ తివారీ, శ్రీపతి మిశ్రా) బ్రాహ్మణులే. 21 ఏళ్ల సుదీర్ఘ కాంగ్రెస్‌ పాలన తర్వాత  1967లో వ్యవసాయ కులానికి చెందిన ముఖ్యమంత్రిగా మాజీ కాంగ్రెస్‌ నేత, బీకేడీ స్థాపకుడు చౌధరీ చరణ్‌సింగ్‌(జాట్‌) సీఎం అయ్యారు. కాంగ్రెస్‌ పాలనలో బ్రాహ్మణ, కాయస్థ, వైశ్య వర్గాలకు చెందినవారే ముఖ్యమంత్రులయ్యారు. బ్రాహ్మణుల తర్వాత ఎక్కువ జనాభా ఉన్న బీసీ వర్గం యాదవ కుటుంబంలో జన్మించిన నేత(రాంనరేశ్‌యాదవ్‌) మొదటిసారి సీఎంగా ప్రమాణం చేసింది 1977 జనతాపార్టీ హయాంలోనే. కాంగ్రెస్‌ పాలనలో క్షత్రియవర్గానికి(ఠాకూర్‌ లేదా రాజపూత్‌) చెందిన ఇద్దరు నేతలు విశ్వనాథ్‌ప్రతాప్‌(వీపీ) సింగ్‌ (1980లో), వీర్‌బహాదూర్‌సింగ్‌(1985లో) సీఎంలయ్యారు.
ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి ఈయనే

1970–71 మధ్య దాదాపు ఆరు నెలలు కాంగ్రెసేతర సంకీర్ణ సర్కారును నడిపిన సీఎం త్రిభువన్‌ నారాయణ్‌(టీఎన్‌) సింగ్‌ కూడా రాజపూత్‌ వర్గానికి చెందిన నేత. మరో విశేషమేమంటే, ఇంతకు ముందు బీజేపీ చివరి సీఎం రాజ్‌నాథ్‌సింగ్‌ 2002లో పదవి నుంచి వైదొలిగారు. ఆయన తర్వాత బీజేపీ సీఎం పదవి కైవసం చేసుకోవడానికి 15 ఏళ్లు పట్టింది. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రిగా ఉన్న రాజ్‌నాథ్‌ తర్వాత కాషాయపక్షం తరఫున ఆయన సామాజికవర్గానికి చెందిన ఆదిత్యనాథ్‌ను ఎంపికచేశారు. బీజేపీ అవిభక్త యూపీలో మొదటిసారి సాధారణ మెజారిటీ(425కు గానూ 221 సీట్లు) సాధించినప్పుడు బీసీ వర్గానికి చెందిన కల్యాణ్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. మళ్లీ పాతికేళ్లు గడిచాక( నాలుగింట మూడొంతులు) మెజారిటీ సాధించాక ప్రస్తుత ఉత్తరాఖండ్‌ ప్రాంతంలోని రాజ్‌పూత్‌ కుటుంబంలో పుట్టిన ఆదిత్యనాథ్‌కు బీజేపీ సీఎం పదవి కట్టబెట్టింది.  
- సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 

మరిన్ని వార్తలు