అక్రమకట్టడాలపై బీఎంసీ ఉక్కుపాదం

30 Dec, 2017 15:49 IST|Sakshi

ముంబై : భారీ అగ్ని ప్రమాదం జరిగిన అనంతరం బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) దిద్దుబాటు చర్యలను చేపట్టింది. ముంబైలోని లోయర్‌పరేల్‌ ప్రాంతంలోని కమలామిల్స్‌ కాంపౌండ్‌లో నిర్మించిన అక్రమ కట్టడాలపై  దృష్టిసారించింది. బీఎంసీ అధికారులు శనివారం ఉదయం నుంచి అక్రమ కట్టడాలను కూల్చివేయడం ప్రారంభించారు. రెండు రెస్టారెంట్లలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేశామని బీఎంసీ ఉన్నతాధికారులు తెలిపారు. రైలు బోగీలా కనిపించేలా నిర్మించిన ప్రముఖ రెస్టారెంట్ ప్రవాస్లోని కొన్ని కట్టడాలను కూల్చివేశారు. అంధేరీలోని మరికొన్ని రెస్టారెంట్లపైన కూడా చర్యలకు ఆదేశించినట్టు అధికారులు చెప్పారు.

లోయర్‌ పరేల్‌లోని కమలా మిల్స్‌ కాంపౌండ్‌లోని ఓ భవనం పై అంతస్తు రూఫ్‌టాప్‌లో 1 అబవ్‌ అనే పబ్‌లో అగ్రిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఖుష్బూ సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ భవనం మొత్తంమీద సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, మంటలను ఆర్పే పరికరాలు లేకపోవటంతో ఈ ప్రమాద తీవ్రత పెరిగినట్టు తెలుస్తోంది. దీనికి తోడు.. మూడు, నాలుగు అంతస్తుల్లో ఉన్న పబ్బుల నిర్వాహకులు పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. కిందకు వెళ్లే అత్యవసరమార్గాలన్నీ మూసే ఉన్నట్లు తెలిసింది. ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది మరో మార్గంలో కొందరిని తరలించి ఉండకపోతే మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేది. అటు ఇలాంటి పబ్బులపై కఠినమైన చర్యలు తీసుకోవటంలో బీఎంసీ వైఫల్యం కూడా కొట్టొచ్చినట్లు కనబడుతోంది. 1 అబవ్‌ పబ్‌కు మూడుసార్లు హెచ్చరికలు జారీ చేశామని అధికారులు చెబుతున్నారు. అధికారులకు మామూళ్లు ముడుతున్నందునే వీరిపై చర్యలు తీసుకోలేదని ముంబై వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు