సహకరించని గ్రామస్తులు.. తల్లి శవాన్ని సైకిల్‌పై

17 Jan, 2019 11:41 IST|Sakshi

భువనేశ్వర్‌ : ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ మృతి చెందితే ఆ గ్రామానికి చెందిన ఏ ఒక్కరు దగ్గరకు రాలేదు. కారణం ఆమె తక్కువ కులానికి చెందిన మహిళ కావడమే. చివరకు ఆమె కుమారుడు ఒక్కడే సైకిల్‌పై తన తల్లి శవాన్ని తీసుకెళ్లి అడవిలో ఖననం చేశాడు. ఈ హృదయవిదారకర ఘటన ఒడిశాలోని  కర్పాబహాల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జాంకి సిన్హానియా(45), తన కుమారుడు సరోజ్‌(17)తో కలిసి నివాసం ఉంటుంది. ఆమె భర్త గత కొద్ది రోజుల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆమె కూలీ పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల మంచి నీళ్ల కోసం బావి వద్దకు వెళ్లి అదుపు తప్పి అందులో పడి మృతి చెందారు. 

తన తల్లి అంత్యక్రియలకు సహకరించాలని సరోజ్‌  గ్రామస్తులను కోరినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఒక్కడే తల్లి శవాన్ని సైకిల్‌పై తీసుకెళ్లి గ్రామానికి దాదాపు 6కిలో మీటర్ల దూరంలో ఉన్న  అడవిలో ఖననం చేశాడు. అంత్యక్రియలకు సహకరించాలని గ్రామస్తులను వేడుకున్నప్పటికీ ఎవరూ ముందుకు రాలేదని సరోజ్‌ తెలిపారు. తక్కువ కులానికి చెందిన వాళ్లమని గ్రామస్తులంతా తమను దూరం పెట్టారని వాపోయారు.

మరిన్ని వార్తలు