సీఏఏ రగడ : ఆ రోజు ఏం జరిగిందంటే!

23 Dec, 2019 08:33 IST|Sakshi

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిసెంబర్‌ 15న ఆగ్నేయ ఢిల్లీలోని జామియా మిలియా వర్సీటీ విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జి చేయడం తీవ్ర కలకలం రేపింది. శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జి చేయడం అప్రజాస్వామికమని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు విమర్శలు గుప్పించాయి. విద్యార్థులకు సంఘీభావంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు ఇండియా గేట్‌ వద్ద మౌన ప్రదర్శన నిర్వహించారు. అయితే తమపై వచ్చిన ఆరోపణలను పోలీసులు ఖండించారు. వర్సిటీలో ఉంటూ విద్యార్థులను రెచ్చగొడ్తున్న విద్యార్థేతరులను అదుపులోకి తీసుకునేందుకే తాము ప్రయత్నించామని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులే హింసకు పాల్పడ్డారని చెప్పారు. తాజాగా ఆ రోజున జామియా యూనివర్సిటీలో జరిగిన అల్లర్లకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు బయటికొచ్చాయి.

ఆ వీడియోలో నిరసనకారులు ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌కు చెందిన బస్సుకు తగలబెట్టడం, ఓ బైక్‌ నుంచి పెట్రోల్‌ తీయడం, మరో బైక్‌కు నిప్పంటించి దాని రోడ్డుపైకి లాక్కెడం లాంటి దృశ్యాలు ఉన్నాయి. వర్సిటీ దగ్గరలో నిరసనకారులు హింసకు పాల్పడ్డారని తెలియజేయడానికే ఢిల్లీ పోలీసులు ఈ వీడియోలను విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. 

>
మరిన్ని వార్తలు