జనఔషధితో రూ.వెయ్యి కోట్లు ఆదా!

8 Mar, 2019 04:39 IST|Sakshi

లబ్ధిదారులు, దుకాణ యజమానులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

న్యూఢిల్లీ/లక్నో: కేంద్రం ప్రవేశపెట్టిన జన ఔషధి పథకం ద్వారా సామాన్య ప్రజలకు దాదాపు రూ.వెయ్యికోట్లు ఆదా అయినట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ పథకం కింద నాణ్యమైన మందులు సరసమైన ధరలకే సామాన్యులకు అందజేస్తున్నట్లు చెప్పారు. 850 రకాల అత్యవసర మందుల ధరలను నియంత్రించామని, గుండె శస్త్రచికిత్సకు సంబంధించిన స్టెంట్లు, మోకాలు సర్జరీ పరికరాల ధరలు తగ్గించామని తెలిపారు. దేశవ్యాప్తంగా తాము ఏర్పాటు చేసిన జన ఔషధి కేంద్రాల ద్వారా పేద ప్రజలే కాకుండా మధ్యతరగతి వారు కూడా లబ్ధి పొందారన్నారు. ఎలాంటి ప్రకటనలు చేయకుండానే కేవలం జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రజలు రూ.వెయ్యి కోట్లు ఆదా చేసుకున్నారని, ఇది ప్రారంభం మాత్రమేనని చెప్పారు. ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పథకం లబ్ధిదారులు, మందుల దుకాణాల యజమానులతో గురువారం మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మార్కెట్‌ ధరలతో పోలిస్తే జన ఔషధి కేంద్రాల్లో మందులు దాదాపు 50 నుంచి 90 శాతం తక్కువకే దొరుకుతున్నాయని పేర్కొన్నారు..

మోదీని ప్రధాని చేసిన కుర్చీ
లక్నో:  మోదీ కాన్పూర్‌ పర్యటన నేపథ్యంలో స్థానిక బీజేపీ శాఖ ఓ ‘అదృష్ట కుర్చీ’ని ముస్తాబు చేసింది. ఈ చెక్క కుర్చీని పవిత్రమైనదిగా కాన్పూర్‌ బీజేపీ కార్యకర్తలు భావిస్తుంటారు. మోదీ మళ్లీ ప్రధాని అయ్యేందుకు ఆ కుర్చీ దోహదం చేస్తుందని నమ్ముతున్నారు. శుక్రవారం మోదీ కాన్పూర్‌ పర్యటనలో ‘అదృష్ట కుర్చీ’పై కూర్చోవాల్సిందిగా కోరుతూ స్థానిక బీజేపీ కార్యకర్తలు ప్రధానికి లేఖ రాశారు. 2014 లోక్‌సభ ఎన్నికలు, 2017 ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాన్పూర్‌ వచ్చినప్పుడు మోదీ ఈ కుర్చీలో కూర్చోవడంతోనే ఆ రెండు ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించిందని కాన్పూర్‌ బీజేపీ అధ్యక్షుడు సురేంద్ర మైథనీ వివరించారు. తొలుత మోదీ 2013 అక్టోబర్‌ 19న ఈ కుర్చీని మోదీ వినియోగించారు.

మరిన్ని వార్తలు