వివాదాలకు కేరాఫ్.. స్వామి!

2 May, 2016 08:31 IST|Sakshi
వివాదాలకు కేరాఫ్.. స్వామి!

♦ నాడు సంఘ్ వ్యతిరేకి.. నేడు బీజేపీ ఎంపీ
♦ 1999లో వాజ్‌పేయి ప్రభుత్వం కూలడానికి సూత్రధారి
 
సాక్షి, సెంట్రల్ డెస్క్: సుబ్రమణ్య స్వామి.. హార్వర్డ్ వర్సిటీలో పీహెచ్‌డీ చేసిన ఆర్థిక వేత్తగా కన్నా.. వివాదాస్పదుడైన రాజకీయ నేతగానే సుప్రసిద్ధుడు. సంచలన ఆరోపణలతో, సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలతో నిత్యం వార్తల్లో నిలవడం ఆయన ప్రత్యేకత. మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయిని తాగుబోతు అన్నా, సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సూర్జిత్‌ను అవినీతిపరుడన్నా, కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీ ఇటలీ మూలాలను పదేపదే ప్రస్తావిస్తూ ఆమెను స్మగ్లర్ అంటూ ఆరోపణలు గుప్పించినా, ముస్లింలకు ఓటుహక్కు రద్దుచేయాలంటూ అవాకులు పేలినా.. ఆయనకే చెల్లింది.

తాజాగా రాజ్యసభ సభ్యుడిగా సభలో అడుగుపెట్టిన తరువాత తొలి మూడు రోజులూ ఆయనే వార్తల్లో వ్యక్తి. అగస్టా కుంభకోణాన్ని సభలో ప్రస్తావించి, కాంగ్రెస్‌ను రెచ్చగొట్టి, మూడు రోజుల పాటు హంగామా సృష్టించారు. అగస్టా స్కామ్‌లో లోక్‌సభ సభ్యురాలు సోనియాగాంధీ పేరును  రాజ్యసభలో ప్రస్తావించి డిప్యూటీ చైర్మన్ కురియన్ ఆగ్రహానికి గురయ్యారు. ఈ సభలో వేరే సభ సభ్యుల ప్రస్తావన తేవొద్దని, మరోసారి అలా చేస్తే తీవ్ర చర్యలుంటాయని కురియన్ హెచ్చరించే పరిస్థితి తెచ్చుకున్నారు. అలా అని స్వామికి సభా నిబంధనలు తెలియవని కాదు.. 1974- 1999 మధ్య ఐదు పర్యాయాలు ఆయన ఎంపీగా పనిచేశారు.

మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. అయినా,  సభలో తాను చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడం తప్పంటూ ట్వీటర్‌లో ఆసంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణంగా స్వామి ఆరోపణలు సంచలనాత్మకంగా ఉంటాయి కానీ వాటికి కచ్చితమైన ఆధారాలు మాత్రం ఉండవని రాజకీయ వర్గాలు భావిస్తుంటాయి. మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, ప్రస్తుత మంత్రులు సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ తరహాలో పూర్తి ఆధారాలు, సమాచారంతో ఆయన మాట్లాడరని చెబుతుంటాయి.

 స్వామి మొదటినుంచి బీజేపీకి మిత్రుడేం కాదు. అలాగే కాంగ్రెస్‌కు ఆజన్మ విరోధీ కాదు. గతంలో ఆయన సోనియాకూ ఆత్మీయుడే.. బీజేపీకీ బద్ధ విరోధే. 1999లో వాజ్‌పేయి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను, సోనియాను ఒక్కటి చేసిన ఘనత స్వామిదే. లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వ ఓటమికి ప్రధాన కారణమైన స్పెక్ట్రం కుంభకోణాన్ని బయటపెట్టింది కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) అయినా, ఆ స్కాంకు ఆ స్థాయి ప్రాచుర్యం కల్పించింది, సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేలా చేసింది మాత్రంస్వామినే.

ప్రస్తుతం.. రాజ్యసభలో కాంగ్రెస్ వ్యతిరేక బ్రిగేడ్‌కు అనధికారికంగా నేతృత్వం వహిస్తున్న స్వామి.. రాజ్యసభ సభ్యత్వంతో ఆగిపోతారా? మోదీ నుంచి ఇంకేదైనా పెద్ద ‘బాధ్యత’ను ఆశిస్తున్నారా? అన్న చర్చ ఇప్పుడు పార్లమెంటు వర్గాల్లో నడుస్తోంది. మరోవైపు, బీజేపీతో స్వామి అనుబంధం ఎక్కువ రోజులు సాగకపోవచ్చన్నది మరికొందరి వాదన.

మరిన్ని వార్తలు