సుప్రీంకోర్టులో కర్ణాటకకు స్వల్ప ఊరట

12 Sep, 2016 12:34 IST|Sakshi
సుప్రీంకోర్టులో కర్ణాటకకు స్వల్ప ఊరట

న‍్యూఢిల్లీ: కావేరి జల వివాదం వ్యవహారంలో కర్ణాటక రాష్ట్రానికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. సెప్టెంబర్ 5 ఇచ్చిన తీర్పును ఉన్నత ధర్మాసనం సోమవారం సవరించింది. రోజుకు 12వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కర్ణాటకను సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశించింది.

కావేరి నుంచి తమిళనాడుకు 15వేల క్యూసెక్కుల నీటిని కాకుండా వెయ్యి క్యూసెక్కులనే విడుదల చేయాడానికి అనుమతించాలంటూ కర్ణాటక ప్రభుత్వం శనివారం సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం కర్ణాటక ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా పున సమీక్షించాలని కోరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది.

సెప్టెంబర్‌ 20లోగా తమిళనాడుకు 12వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సిందేనని స్పష్టం చేసింది. కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ కర్ణాటక ప్రజలు చేసిన ఆందోళనలను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దేశ ప్రజలందరూ కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని,  ఇరు రాష్ట్రాల ప్రజలు చట్టాన్ని గౌరవించి సంయమనం పాటించాలని సూచించింది.

తదుపరి విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది. కాగా కావేరి నదీ జలాల నుంచి తమిళనాడుకు రోజుకు 15వేల క్యూసెక్కుల చొప్పున పదిరోజుల పాటు నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు గతవారం ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు కావేరి నీటిని తమిళనాడు, ఇతర రాష్ట్రాలకు ఎంత పరిమాణంలో విడుదల చేయాలో నిర్ణయించే కావేరి పర్యవేక్షక కమిటీ భేటీ ఇవాళ జరగనుంది.

మరిన్ని వార్తలు