సీఎం కొడుకును ప్రశ్నించిన సీబీఐ

21 Jun, 2016 14:34 IST|Sakshi
సీఎం కొడుకును ప్రశ్నించిన సీబీఐ

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ ను సీబీఐ ప్రశ్నించింది. ఉదయం 11 గంటలకు విక్రమాదిత్య ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నాడు. ఈ కేసులో వీరభద్రసింగ్ పిల్లలు విక్రమాదిత్య, అపరాజితా కుమారిలను సాక్షులుగా పిలిచినట్లు ఢిల్లీ హైకోర్టుకు సీబీఐ సోమవారమే తెలిపింది. అయితే.. సీబీఐ తమను పిలిచిన తర్వాత అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలంటూ వాళ్లిద్దరూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తమ తల్లిదండ్రులతో పాటు వేరేవారిని కూడా నిందితులుగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు గానీ తమ పేర్లు ఎక్కడా లేవని తెలిపారు.

తాము విచారణకు సహకరిస్తాము గానీ, సీబీఐ తమను అరెస్టు చేస్తుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. వీరభద్రసింగ్, ఆయన భార్య ప్రతిభా సింగ్, ఎల్ఐసీ ఏజెంటు ఆనంద్ చౌహాన్ తదితరులపై గత సంవత్సరం సెప్టెంబర్ 23న అవినీతి నిరోధక చట్టం కింద కేసు దాఖలైంది. ప్రాథమిక విచారణ అనంతరం వీరభద్రసింగ్ రూ. 6.03 కోట్ల సంపద మూటగట్టుకున్నట్లు సీబీఐ ఆరోపించింది. 81 ఏళ్ల సింగ్ ను ఇప్పటికే రెండుసార్లు సీబీఐ ప్రశ్నించింది. అయితే అప్పట్లో ఆయన విచారణకు సహకరించకపోవడం, ఆస్తుల గురించిన సమాచారం ఏదీ చెప్పకపోవడంతో ఇప్పుడు ఆయన పిల్లల వంతు వచ్చింది.

మరిన్ని వార్తలు