ఇందిరా జైసింగ్‌ నివాసంలో సీబీఐ దాడులు

11 Jul, 2019 13:29 IST|Sakshi

న్యూఢిల్లీ : విదేశీ నిధుల దుర్వినియోగం ఆరోపణలతో సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌, ఆమె భర్త ఆనంద్‌ గ్రోవర్‌లపై సీబీఐ గురువారం దాడులు నిర్వహించింది. ఢిల్లీలోని ఇందిరా జైసింగ్‌ నివాసం, ఎన్జీవో ఆఫీస్‌, ముంబయిలోని మరో ఆఫీసులో గురువారం ఉదయం 5గంటలకు దాడులు నిర్వహించినట్లు సీబీఐ పేర్కొంది. లాయర్స్‌ కలెక్టివ్‌ పేరిట ఎన్జీవోను స్థాపించి విదేశీ సహకార నియంత్రణ చట్టాన్ని(ఎఫ్‌సీఆర్‌ఎ) ఉల్లఘించారన్న ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే ఆనంద్‌గ్రోవర్‌ పై కేసు నమోదైనట్లు వెల్లడించింది. 

2006 నుంచి 2014 మధ్య ఆనంద్‌ గ్రోవర్‌ 'లాయర్‌ కలెక్టివ్‌' ఎన్జీవో సంస్థ ద్వారా దాదాపు రూ.32 కోట్ల అవకతవకలకు పాల్పడ్డారని హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు ఇచ్చింది. అయితే ఫిర్యాదులో ఇందిరా జైసింగ్‌ను నిందితురాలిగా పేర్కొనలేదని, కానీ లాయర్స్‌ కలెక్టివ్‌ నుంచి ఆమెకు రూ.96.60లక్షలు ముడుపులు అందినట్లు ఆరోపణలు వచ్చాయని సీబీఐ స్పష్టం చేసింది. మరోవైపు ఇందిరా జైసింగ్‌ 2009 నుంచి 2014 వరకు  అదనపు సొలిసిటర్‌గా భాద్యతలు నిర్వహించిన సమయంలో తన విదేశీ పర్యటనలకు సంబంధించిన ఖర్చులను హోంశాఖ అనుమతి లేకుండానే ఎన్జీవో సంస్థ నుంచి పొందినట్లు సీబీఐ తెలిపింది.

సీనియర్‌ న్యాయవాది ఇందిరాజైసింగ్‌ పై సీబీఐ నిర్వహించిన దాడులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రంగా ఖండించారు. ' రాజ్యాంగ విలువలను కాపాడడానికి వాళ్ల జీవితం మొత్తాన్ని అంకితం చేశారని, అటువంటి వారిపై అభియోగం మోపడం చాలా భాదాకరమని' కేజ్రీవాల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు