పాత పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ పై కమిటీలు

22 Nov, 2016 09:19 IST|Sakshi
పాత పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ పై కమిటీలు

న్యూఢిల్లీ: పెద్ద కరెన్సీ నోట్ల రద్దుకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరును పరిశీలించడం కోసం సీనియర్‌ అధికారులతో కమిటీలు ఏర్పాటుచేసినట్లు కేంద్రం సోమవారం ప్రకటించింది. అదనపు కార్యదర్శులు/సంయుక్త కార్యదర్శులు/డైరెక్టర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. ప్రతి కమిటీలో ఇద్దరు లేదా ముగ్గురు అధికారులుంటారు. తమకు కేటాయించిన రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో కనీసం రెండు రోజులు సందర్శించి కమిటీలు నగదు రద్దు స్థితిగతులపై  ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తాయి.

కరెన్సీ నోట్ల లభ్యత, పెద్ద నోట్ల మార్పిడి, బ్యాంకుల్లో జమ, ఉపసంహరణ, రూ. 2000, 500 నోట్లు వెలువరించేలా ఏటీఎంలలో మార్పులు చేర్పులు తదితరాలకు సంబంధించిని సమస్యలను పరిశీలిస్తాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం గృహాలు, వ్యవసాయదారులు, దినసరి కూలీలు, వ్యాపారులు, రవాణా తదితరాలపై చూపుతోన్న ప్రభావాన్ని అంచనావేస్తాయి. ఈ విధానం అమల్లో ఎదురవుతున్న సవాళ్లను తమ నివేదికల్లో పొందుపరుస్తాయని ఆర్థిక శాఖ ప్రకటన జారీ చేసింది.

మరిన్ని వార్తలు