‘కావేరి’పై సుప్రీంకు ముసాయిదా

15 May, 2018 02:56 IST|Sakshi

సమర్పించిన కేంద్ర ప్రభుత్వం  

న్యూఢిల్లీ: కావేరి నదీ జలాల నిర్వహణకు సంబంధించిన ముసాయిదా ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ ముసాయిదాను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనానికి సోమవారం సమర్పించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, కేంద్రం ప్రతిపాదించిన ప్రణాళిక ఫిబ్రవరి 16 నాటి తమ తీర్పుకు అనుగుణంగా ఉందా లేదా అనేది ఈ నెల 16న పరిశీలించి, ఆమోదం తెలుపుతామని పేర్కొంది.

కావేరీ నదీ జలాల నిర్వహణ సంస్థను బోర్డు అనాలా? కమిటీ అనాలా? అథారిటీ అనాలా? అన్న విషయాన్ని సుప్రీంకోర్టుకే వదిలేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. కావేరి జలాల పంపిణీ కోసం బెంగళూరు కేంద్రంగా 9 మంది సభ్యులుగాగల ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ కమిటీలో కేంద్రం నియమించే ఓ చైర్మన్, ఇద్దరు శాశ్వత సభ్యులు, ఇద్దరు తాత్కాలిక సభ్యులతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిల నుంచి ఒక్కోప్రతినిధి ఉంటారు.

కావేరి నదీ జలాల పంపిణీని మార్చడంతోపాటు కావేరి మేనేజ్‌మెంట్‌ బోర్డును ఆరు వారాల్లో ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ ఫిబ్రవరి 16నే సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెలిసిందే. అయినా ఇన్నాళ్లూ కేంద్రం జాప్యం చేయడంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ నెల 8న కేసును విచారిస్తూ కేంద్రం చర్యలు పూర్తిగా కోర్టు ధిక్కారం కిందకు వస్తాయనీ, ఈ నెల 14న (సోమవారమే) కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి స్వయంగా హాజరై ముసాయిదాను సమర్పించకపోతే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ముసాయిదాను సమర్పించింది.  

మరిన్ని వార్తలు