15వ తేదీ వేకువ జామున చంద్రయాన్‌–2 ప్రయోగం

13 Jul, 2019 02:22 IST|Sakshi
చంద్రయాన్‌–2కు సిద్ధంగా ఉన్న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1

జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 రాకెట్‌కు విజయవంతంగా లాంచ్‌ రిహార్సల్స్‌

సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా సతీష్‌ ధవన్‌స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 15వ తేదీ వేకువ జామున నిర్వహించనున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 ఉపగ్రహ వాహక నౌకకు శుక్రవారం లాంచ్‌ రిహార్సల్స్‌ను విజయవంతంగా నిర్వహించారు. అనంతరం రాకెట్‌లోని ఇంధనం నింపే ట్యాంకులకు ప్రీ ఫిల్‌ ప్రెజరైజేషన్‌ కార్యక్రమాన్ని  పూర్తి చేశారు. ఈ నెల 7వ తేదీన రాకెట్‌ ప్రయోగవేదిక మీదకు వచ్చిన తరువాత దశల వారీగా తనిఖీలు చేస్తూ ఉన్నారు.  శనివారం ఉదయాన్నే షార్‌లోని బ్రహ్మప్రకాష్‌ హాలులో ఎంఆర్‌ఆర్‌ కమిటీ చైర్మన్‌ బీఎన్‌ సురేష్‌ ఆధ్వర్యంలో జరుగనున్న ఎంఆర్‌ఆర్‌ సమావేశంలో  ప్రయోగ సమయాన్ని, కౌంట్‌డౌన్‌ సమయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

సమావేశం అనంతరం ప్రయోగ పనులను లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డుకు అప్పగించాక లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు చైర్మన్‌ ఆర్ముగం రాజరాజన్‌ ఆధ్వర్యంలో మరో మారు లాంచ్‌ రిహార్సల్స్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రయోగానికి సుమారుగా 20 గంటల ముందు అంటే 14వ తేదీ  ఉదయం 6.51 గంటలకు కౌంట్‌డౌన్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 15వ తేదీ వేకువజామున 2.51 గంటలకు 3,800 కిలోలు బరువు కలిగిన చంద్రయాన్‌–2 మిషన్‌ను మోసుకుని నింగికి దూసుకెళ్లేందుకు జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 రాకెట్‌ సిద్ధంగా ఉంది. 

మరిన్ని వార్తలు