‘ఆ ఆరుగురిపై చర్యలెందుకు లేవు?’

5 Aug, 2017 21:02 IST|Sakshi
‘ఆ ఆరుగురిపై చర్యలెందుకు లేవు?’

చెన్నై: విదేశీ పెట్టుబడుల వ్యవహారంలో ఆరుగురు ప్రభుత్వ కార్యదర్శులపై సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోలేదని మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో గత 2006లో ముంబైలో ఐఎన్‌ఎక్స్‌ మీడియా సంస్థను పారిశ్రామికవేత్త పీటర్‌ ముఖర్జీ, ఇంద్రాణీ ముఖర్జీలు నిర్వహించారు. ఆ సమయంలో కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం కుమారుడు కార్తీ చట్టవిరుద్ధంగా ఐఎన్‌ఎక్స్‌ సంస్థకు అనుమతి ఇప్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా సదరు సంస్థ నుంచి కార్తీ చిదంబరం లంచాలు తీసుకున్నట్లు, ఆ సంస్థను పరోక్షంగా తన కట్టడిలో ఉంచుకున్నట్లు సీబీఐ ఆరోపించింది.

గత మే నెలలో దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ కార్తీ చిదంబరం, పీటర్‌ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీ ముంబై, ఢిల్లీలోగల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరిపింది. ఇలా వుండగా శుక్రవారం కేంద్ర హోంశాఖ కార్తీ చిదంబరంను వెతుకుతున్న నేరస్థునిగా ప్రకటించడంతో ఆయన మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ న్యాయమూర్తి ఎం.దురైసామి ఎదుట శుక్రవారం విచారణకు వచ్చింది. అనంతరం కేసు విచారణను ఆగస్టు ఏడవ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. అయితే, ఈ విషయంతో సంబంధం ఉన్న ఆరుగురు ప్రభుత్వ కార్యదర్శులపై మాత్రం చర‍్యలెందుకు తీసుకోలేదని చిదంబరం కేంద్రాన్ని నిలదీశారు.

మరిన్ని వార్తలు