చైనా అడ్డుకోవడం వల్లే ఆలస్యం

23 Feb, 2019 02:08 IST|Sakshi

పుల్వామా దాడిపై యూఎన్‌ఎస్సీ ప్రకటన జాప్యంపై అధికారులు

జైషే మహ్మద్‌ కార్యాలయాన్ని నియంత్రణలోకి తీసుకున్న పాక్‌  

న్యూఢిల్లీ/బీజింగ్‌: పుల్వామా ఉగ్రవాద దాడిని ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి (యూఎన్‌ఎస్సీ) ఖండిస్తూ ప్రకటన చేయడంలో వారం ఆలస్యం కావడానికి చైనాయే కారణమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా చొరవతోనే వారం తర్వాతైనా ఆ ప్రకటన వచ్చిందన్నాయి. ఈ నెల 14న జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ వాహన శ్రేణిపై జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ దాడి చేయడంతో 40 మంది జవాన్లు అమరులవ్వడం తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఈ నెల 21న యూఎన్‌ఎస్పీ ప్రకటన చేసింది. ‘ఫిబ్రవరి 14న పిరికిపందలు చేసిన హీనమైన పుల్వామా ఉగ్రవాద దాడిని యూఎన్‌ఎస్సీ సభ్యదేశాలు ఖండిస్తున్నాయి. ఈ దాడికి జైషే మహ్మద్‌ సంస్థ బాధ్యత ప్రకటించుకుంది.

దాడి కుట్రదారులు, నిర్వాహకులు, ఆర్థిక చేయూతనిచ్చిన వారందరినీ చట్టం ముందుకు తెచ్చి శిక్షించాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ చట్టాలు, యూఎన్‌ఎస్సీ తీర్మానాలను అనుసరించి ఉగ్రవాదులను పట్టుకుని శిక్షించేందుకు అన్ని దేశాలూ భారత ప్రభుత్వం, ఇతర విభాగాలకు సహకరించాలి’ అని ఆ ప్రకటనలో యూఎన్‌ఎస్సీ పేర్కొంది. మండలిలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనాలు శాశ్వత సభ్యదేశాలు కాగా, మరో 10 తాత్కాలిక సభ్య దేశాలుంటాయి. వాస్తవానికి ఈ ప్రకటన  15వ తేదీ సాయంత్రమే రావాల్సిందనీ, అయితే సవరణలు చేయాలంటూ చైనా అడ్డు చెప్పడంతోనే ఆలస్యమైందని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ ప్రకటనను నీరుగార్చేందుకు చైనా ప్రయత్నించగా, అసలు ప్రకటనే రాకుండా ఉండేందుకు పాక్‌ పావులు కదిపినా సఫలం కాలేకపోయిందని అధికారులు తెలిపారు. 15న ప్రకటన చేయడానికి 14 దేశాలు ఒప్పుకోగా, చైనా మాత్రం 18వ తేదీకి వాయిదా వేయాలని కోరిందనీ, ఆ తర్వాతా సవరణలు సూచించిందని చెప్పారు.  కాగా, ఒక దాడిని ఖండిస్తూ యూఎన్‌ఎస్సీ ప్రకటన విడుదల చేయడం ఇదే ప్రథమం.  మరోవైపు అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి బహవాల్పూర్‌లోని జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం పాకిస్తాన్‌ ప్రభుత్వం తమ నియంత్రణలోకి తీసుకుంది.

మరిన్ని వార్తలు