నేడు లోక్‌సభకు పౌరసత్వ బిల్లు

9 Dec, 2019 03:11 IST|Sakshi

బీజేపీ సభ్యులకు విప్‌ జారీ

న్యూఢిల్లీ: పౌరసత్వ (సవరణ) బిల్లుతోపాటు చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా పొడిగింపునకు ఉద్దేశించిన బిల్లును సోమవారం కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మత వివక్ష కారణంగా వలసవచ్చిన ముస్లిమేతరు లకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ బిల్లును హోం మంత్రి అమిత్‌ షా దిగువ సభలో ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం సభలో ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ, అనంతరం ఓటింగ్‌ జరగనుందని లోక్‌సభ వర్గాలు తెలిపాయి.

అదేవిధంగా, లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లను మరో పదేళ్లపాటు పొడిగించేందుకు ఉద్దేశించిన బిల్లును కూడా ప్రభుత్వం నేడు సభలో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోటా 2020 జనవరితో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ తమ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులకు విప్‌ జారీ చేసింది.

సోమవారం నుంచి మూడు రోజులపాటు సభకు తప్పని సరిగా హాజరు కావాలని ఆదేశించింది. పౌరసత్వ బిల్లుపై కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ విరుచుకుపడ్డారు. గాంధీజీ ఆలోచనా విధానం పై జిన్నా వాదానికి గెలుపు వంటిదే పౌరసత్వ బిల్లు అని విమర్శించారు. ఈ బిల్లును నిరసిస్తూ 10వ తేదీన బంద్‌ పాటించాలని ఈశాన్య విద్యార్థుల సమాఖ్య పిలుపునిచ్చింది.

మరిన్ని వార్తలు