కర్ణాటక ‘ఉప’ ఫలితాలు నేడే

9 Dec, 2019 03:20 IST|Sakshi

అన్ని పార్టీల్లో ఉత్కంఠ

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఉత్కంఠ రేకెత్తిస్తున్న 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. ఈ నెల 5న రాష్ట్రంలో 15 సీట్లకు పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. మైనారిటీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న యడియూరప్ప తన ప్రభుత్వాన్ని నిలుపుకునేందుకు ఎక్కువ సీట్లు సాధించాల్సి ఉంది. కనీసం 8 సీట్లలో గెలిస్తేనే బీజేపీ ప్రభుత్వం ఒడ్డున పడుతుంది. మరోవైపు అధికార బీజేపీని నిలువరించి తిరిగి అధికారంలోకి రావాలని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

సోమవారం మధ్యాహ్నంలోగా పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు దగ్గర పడే కొద్దీ బీజేపీ తరఫున పోటీ చేసిన అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలతో పాటు వివిధ పార్టీల అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కీలకంగా వ్యవహరించిన అనర్హత ఎమ్మెల్యేల భవితవ్యం కూడా నేడు తేలనుంది.

బీజేపీకి పట్టం కట్టిన ఎగ్జిట్‌పోల్స్‌..  
ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ బీజేపీకి పట్టం కట్టడంతో సీఎం యడియూరప్ప ధైర్యంగా కనిపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ శాస్త్రీయమైనవి కాదంటున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు మొత్తం 15 స్థానాల్లో, జేడీఎస్‌ 12 చోట్ల బరిలో ఉన్నాయి.

మరిన్ని వార్తలు