రణరంగంగా తీస్‌హజారీ కోర్టు

3 Nov, 2019 03:26 IST|Sakshi
మంటలకు ఆహుతి అవుతున్న పోలీసు జీప్‌. పక్కన న్యాయవాదులు

లాయర్లు, పోలీసుల మధ్య ఘర్షణ 10 మంది పోలీసులు,

పలువురు లాయర్లకు గాయాలు

పోలీస్‌ జీప్‌నకు నిప్పు

17 వాహనాలు ధ్వంసం

న్యూఢిల్లీ: ఢిల్లీలోని తీస్‌హజారీ కోర్టు ఆవరణ శనివారం రణరంగాన్ని తలపించింది. లాయర్లు, పోలీసుల మధ్య తలెత్తిన ఘర్షణలో పదిమంది పోలీసులు, పలువురు లాయర్లకు గాయాలయ్యాయి. ఆందోళనకారులు ఒక పోలీస్‌ వ్యానుకు నిప్పుపెట్టారు. మరో 17 వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై తీస్‌హజారీ బార్‌ అసోసియేషన్‌ సెక్రటరీ జైవీర్‌సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ.. ‘కోర్టు ఆవరణలో ఉన్న పోలీస్‌ జైలు జీప్‌కు ఓ న్యాయవాది కారు పొరపాటున ఢీకొట్టడంతో ఈ గొడవ మొదలైంది.

సదరు లాయర్‌ను స్టేషన్‌లోకి తీసుకెళ్లి పోలీసులు విపరీతంగా కొట్టారు. ఎస్‌హెచ్‌వో మమ్మల్ని లోపలికి వెళ్లనివ్వలేదు. సెంట్రల్, వెస్ట్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు జడ్జీలు వెళ్లి చెప్పినా పోలీసులు లాయరును విడిచిపెట్టలేదు’అని ఆయన ఆరోపించారు. దాదాపు 20 నిమిషాల తర్వాత, నిరసన తెలుపుతున్న లాయర్లపైకి పోలీసులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రంజిత్‌కు బుల్లెట్‌ గాయాలయ్యాయి. మరో నలుగురు లాయర్లు గాయపడ్డారు. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ మాపై చేయి చేసుకున్నారు’అని చౌహాన్‌ పేర్కొన్నారు.

అరగంట తర్వాత అరెస్టు చేసిన లాయరును పోలీసులు విడిచిపెట్టారని వివరించారు. ఈ ఘటనకు కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ లాయర్లు కోర్టు గేటు వద్ద నిరసన తెలిపారు. లాయర్లు ఒక పోలీసు వాహనానికి నిప్పు పెట్టడంతోపాటు, మరో 17 ఇతర వాహనాలను ధ్వంసం చేశారు. ఘటనకు నిరసనగా 4న ఢిల్లీలోని జిల్లా కోర్టుల్లో బంద్‌ పాటించనున్నట్లు ఢిల్లీ బార్‌ అసోసియేషన్‌ తెలిపింది. తాము కాల్పులు జరిపామన్న లాయర్ల ఆరోపణను పోలీసు అధికారులు ఖండించారు. లాయర్ల దాడిలో అడిషనల్‌ కమిషనర్‌ హరీందర్‌ కుమార్, సివిల్, కొత్వాల్‌ స్టేషన్ల ఎస్‌హెచ్‌వో తదితరులు 10 మంది గాయపడ్డారని తెలిపారు.
 

మరిన్ని వార్తలు