జూలై 15న బొగ్గు స్కాం కేసు విచారణ

9 Apr, 2015 01:01 IST|Sakshi

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సమన్లు జారీ అయిన బొగ్గు స్కాం కేసు విచారణ జూలై 15న జరగనుంది. ఈ మేరకు విచారణ తేదీని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం నిర్ణయించింది. మార్చి 11న మన్మోహన్‌కు జారీ అయిన సమన్లపై సుప్రీంకోర్టు ఇప్పటికే స్టే విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసు విచారణను సీబీఐ కోర్టు గతంలో వాయిదా వేసింది. తాజాగా ఈ కేసు తదుపరి విచారణకు తేదీని నిర్ణయించింది. నిజానికి ఈ కేసు మూసివేతకు గత డిసెంబర్ 16న సీబీఐ నివేదిక సమర్పించింది. అయితే దీన్ని తిరస్కరించిన కోర్టు.. మరింత లోతుగా దర్యాప్తు జరపాలని, అప్పట్లో బొగ్గు శాఖ బాధ్యతలను కూడా చూసుకున్న మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను, పీఎంవో అధికారులను విచారించాలని ఆదేశించింది.

ఒడిశాలోని తాలాబిరా-2 బొగ్గు బ్లాకును హిందాల్కో కంపెనీకి 2005లో కేంద్రం కేటాయించింది. ఇందులో అక్రమాలు చోటుచేసుకున్నట్లు నమోదైన కేసులో మన్మోహన్‌ను కూడా నిందితుడిగా సీబీఐ పేర్కొంది. కోర్టు ఆదేశాలతో మాజీ ప్రధానితోపాటు హిందాల్కో కంపెనీకి, దాని యాజమాన్యానికి, ఇద్దరు ఉన్నతాధికారులకు సమన్లు జారీ అయ్యాయి. దీనిపై నిందితులు సుప్రీంను ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు.
 
 

మరిన్ని వార్తలు