పంజాబ్‌ ‘హస్త’గతం

12 Mar, 2017 04:04 IST|Sakshi
పంజాబ్‌ ‘హస్త’గతం

117 సీట్లకుగాను 77 సీట్లలో విజయ దుందుభి
20 సీట్లతో రెండో స్థానంలో ఆప్‌.. మట్టికరిచిన అకాలీ–బీజేపీ
సీఎంగా అమరీందర్‌.. అమృత్‌సర్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో్లనూ కాంగ్రెస్‌ హవా


చండీగఢ్‌: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయ దుందుభి మోగించింది. సంపూర్ణ మెజారిటీతో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ సారథ్యంలో పదేళ్ల విరామం తర్వాత మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకుంది. మొత్తం 117 స్థానాలకుగాను 77 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. 2014 లోక్‌సభ ఎన్నికలతోపాటు, పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌కు ఈ విజయంతో కాస్త ఊరట లభించింది. తొలిసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన ఆప్‌ 20 స్థానాల్లో గెలిచి రెండో స్థానంలో నిలవగా, అధికార శిరోమణి అకాలీ దళ్‌(ఎస్‌ఏడీ)–బీజేపీ కూటమి దారుణంగా ఓడిపోయి 18 స్థానాలను మాత్రమే దక్కించుకుని మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

ఈ కూటమిలో ఎస్‌ఏడీకి 15 సీట్లు, బీజేపీకి 3 సీట్లు దక్కాయి. 5 స్థానాల్లో పోటీ చేసిన ఆప్‌ మిత్రపక్షం లోక్‌ ఇన్సాఫ్‌ పార్టీ 2 స్థానాల్లో గెలిచింది. 2012 ఎన్నికల్లో ఎస్‌ఏడీకి 56, బీజేపీకి 12 సీట్లు దక్కాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో 4 స్థానాలు సంపాదించిన ఆప్‌ తాజా ఎన్నికలపై పెద్ద ఆశలు పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. 1992 ఎన్నికల్లో తొలిసారి అత్యధికంగా 87 సీట్లు కొల్లగొట్టిన కాంగ్రెస్‌కు తాజాగా రెండోసారి అంతటి ఘనవిజయం దక్కింది. 2012 ఎన్నికల్లో పార్టీకి 46 సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో 40.11 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్‌కు తాజా ఎన్నికల్లో 38.5 శాతం ఓట్లు(1.61 శాతం తక్కువ) దక్కాయి. ఆప్‌ పోటీ హస్తం ఓట్ల శాతంపై ప్రభావం చూపింది. ఆప్‌కు 23.7 శాతం ఓట్లు దక్కాయి. కాగా, అమరీందర్‌ రాజీనామాతో ఖాళీ అయిన అమృత్‌సర్‌ లోక్‌సభ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ విజయం సాధించింది. కాంగ్రెస్‌ అభ్యర్థి జీఎస్‌ ఔజ్లా.. సమీప బీజేపీ ఆర్‌ఎస్‌ ఛినాను 1,99,189 ఓట్ల తేడాతో ఓడించారు.

మెజారిటీలోనూ కెప్టెనే..
పటియాల నుంచి పోటీ చేసిన రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్, సీఎం అభ్యర్థి అమరీందర్‌ సింగ్‌.. ఆప్‌ అభ్యర్థి బల్బీర్‌ సింగ్‌పై 52,407 ఓట్ల భారీ మెజారిటీ సాధించి తాజా ఎన్నికల విజేతల్లో అత్యధిక మెజారిటీ సాధించిన విజేతగా నిలిచారు. కెప్టెన్‌కు మొత్తం 72,586 ఓట్లు రాగా, బల్బీర్‌కు 20,179 ఓట్లు దక్కాయి. లుంబీ నుంచి కూడా బరిలోకి దిగిన అమరీందర్‌ అక్కడ సీఎం ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ చేతిలో 22,770 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆదివారం సమావేశమై తమ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. అమరీందర్‌ను ఈ పదవికి ఎన్నుకోవడం, ఆయన సీఎం కావడం లాంఛనమే. పంజాబ్‌ ఎన్నికల్లో గెలిచినందుకు అమరీందర్‌ను ప్రధాని మోదీ ఫోన్‌ చేసి అభినందించారు. అమరీందర్‌ను అభినందించానని, ఆయన 75 జన్మదినం సందర్భంగా దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలంటూ శుభాకాంక్షలు తెలిపానని మోదీ ట్విటర్‌లో తెలిపారు.

సిద్ధు.. ఉపముఖ్యమంత్రి!
చండీగఢ్‌: బీజేపీని వదలి జనవరిలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ నవజోత్‌ సింగ్‌ సిద్ధు అమృత్‌సర్‌ ఈస్ట్‌ నుంచి ఘనవిజయం సాధించారు. బీజేపీకి చెందిన సమీప ప్రత్యర్థిని 42,409 ఓట్ల తేడాతో ఓడించి, అత్యధిక మెజారిటీ సాధించిన విజేతల కోవలో రెండో స్థానంలో నిలిచారు. సిద్ధును  ఉపముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉందని  పార్టీ వర్గాలు చెప్పాయి.

కాంగ్రెస్‌కు కలిసొచ్చాయి!
పంజాబ్‌లో కాంగ్రెస్‌ భారీ విజయానికి పలు అంశాలు దోహదం చేశాయి. పదేళ్లుగా అధికారంలో ఉన్న అకాలీదళ్‌పై పంజాబీల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. బాదల్‌ కుటుంబం అవినీతి, ఆశ్రిత పక్షపాతం, వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యలు, డ్రగ్స్, నిరుద్యోగం, వలసలతో తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత  ఏర్పడింది. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలోనే ఇది స్పష్టమైంది. అప్పుడు నాలుగు లోక్‌సభ స్థానాలు గెల్చుకున్న ఆప్‌ ప్రభుత్వ వ్యతిరేక ఓటును పెద్దగా చీల్చలేక పోయింది.  ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈసారి అమరీందర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించిన హైకమాండ్‌ ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అభ్యర్థుల ఎంపికలోనూ జోక్యం చేసుకోలేదు. ఎన్నికల ప్రచారంలో అమరీందర్‌ సింగే సీఎం అవుతారని రాహుల్‌గాంధీ స్పష్టం చేయడం లాభించింది. అమరీందర్‌ దూకుడుగా ప్రచారం నిర్వహించారు. అకాలీలకు అండగా నిలిచే సంప్రదాయ జాట్‌ సిక్కులు కూడా ఈసారి కాంగ్రెస్‌ వైపు మొగ్గారు.




 సిద్ధూ చేరికతో పెరిగిన బలం
మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ను కాంగ్రెస్‌ చేరదీయడం వారికి బాగా లాభించింది. మాఝి ప్రాంతంలో అమృత్‌సర్‌ ఈస్ట్‌ నుంచి పోటీచేసి గెలిచారు సిద్ధూ. అంతేకాకుండా మాఝి ప్రాం తంలో 25 సీట్లలో 22 కాంగ్రెస్‌ ఖాతాలో చేరాయి.

పనిచేసిన హామీలు...
ఇంటికో ఉద్యోగం, ఇళ్లులేని పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు, పెన్షన్లు , పంట నష్టపరిహారం, రైతులకు ఆరోగ్య బీమా, డ్రగ్స్‌ను అరికట్టడం వంటి ఎన్నో హామీలు హస్తం హవాకు తోడ్పడ్డాయి.

ఆప్‌ కంటే అకాలీలకే ఎక్కువ ఓట్లు
అకాలీదళ్‌ 15 సీట్లకే పరిమితమైనా.. ఆ పార్టీకి 25.2 శాతం ఓట్లు పడ్డాయి. మిత్రపక్షం బీజేపీకి  ఓట్లను(5.4 శాతం) కలుపుకొంటే ఆ కూటమికి 30 శాతంపైగా ఓట్లు దక్కాయి. ఆప్‌కు 23.7 శాతం ఓట్లే వచ్చినా 20 స్థానాల్లో నెగ్గింది. కాంగ్రెస్‌కు 38.5 శాతం ఓట్లు పోలయ్యాయి.
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

డ్రగ్‌ మాఫియాపై ఉక్కుపాదం
పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ అమరీందర్‌సింగ్‌
చండీగఢ్‌/అమృత్‌సర్‌: రాష్ట్రంలో వేళ్లూనుకున్న డ్రగ్‌ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని పంజాబ్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ అమరీందర్‌సింగ్‌ చెప్పారు. ఆయన శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘శిరోమణి అకాలీదల్‌ (ఎస్‌ఏడీ) ప్రభుత్వం రాష్ట్రాన్ని అథఃపాతాళానికి నెట్టేసి, సర్వనాశనం చేసింది. ఢిల్లీ సీఎం, ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ వేసవిలో వచ్చిపోయే తుఫానులాంటి వాడు. నేను చెప్పినట్టే అధికారంలోకి వచ్చిన నాలుగు వారాల్లో డ్రగ్‌ మాఫియా సమస్యను పరిష్కరిస్తాం. అలాగే దేవాలయాలపై దాడుల ఘటనలకు సంబంధించి దర్యాప్తు జరుపుతాం. రాజకీయ నాయకుడిగా మారిన క్రికెటర్‌ నవజోత్‌సింగ్‌ సిద్దూను ఉపముఖ్యమంత్రిగా నియమించే అంశంపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిర్ణయం తీసుకుంటారు’ అని అన్నారు.

బాదల్‌ అహంకారంపై విజయం: సిద్దూ
‘పంజాబ్‌లో బాదల్‌ కుటుంబ దురహంకారంపై కాంగ్రెస్‌ సాధించిన ఘన విజయమిది. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ పునరుజ్జీవానికి ఈ విజయం దోహదపడుతుంది. ఇది ఆరంభం మాత్రమే. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ దేశంలో తిరిగి బలం పుంజుకుంటుంది. ఈ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్‌ ఉనికి కోసం జరిగిన పోరు. కేజ్రీవాల్‌... ఆయన చదువుతున్న స్కూలుకు ఆయనే ప్రిన్సిపాల్‌! సామాజిక మాధ్యమాల్లో ఆయన కూడా అబద్ధపు ప్రచారం చేశారు. కానీ... నిజం ఎప్పటికీ ఓడిపోదు’ అని సిద్ధు చెప్పారు.

సీఎం అవుదామనుకుని..!
అప్పట్లో కాంగ్రెస్‌ నేత పి.చిదంబరంపై చెప్పు విసిరిన జర్నైల్‌ సింగ్‌ మీకు గుర్తున్నాడా? తర్వాత ఈయన 2015 ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) తరఫున ఎమ్మెల్యే కూడా అయిపోయాడు. తాజాగా పంజాబ్‌ వెళ్లిపోయి ముఖ్యమంత్రి కూడా అయిపోదామనుకుంటే ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోయింది పాపం. పంజాబ్‌ ఎన్నికల్లో సీఎం ప్రకాశ్‌ సింగ్‌ బాదల్, కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమరీందర్‌ సింగ్‌లపై లంబీ నియోజకవర్గం నుంచి ఆప్‌ తరఫున పోటీ చేసిన జర్నైల్‌ సింగ్‌ పరాజయాన్ని చవిచూశారు. పంజాబ్‌ సొంత రాష్ట్రం కావడంతో ఢిల్లీలో రాజీనామా చేసి వచ్చి మరీ పోటీ చేశారు. పంజాబ్‌లో ఆప్‌కు ఆయనే సీఎం అభ్యర్థి అనే ప్రచారం కూడా జరిగింది. సీఎం పదవికి ఆశపడి వస్తే.. ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోయింది.

మరిన్ని వార్తలు