గుంతలపై ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు

16 Jul, 2014 01:23 IST|Sakshi

సాక్షి, ముంబై: రోడ్లపై ఏర్పడిన గుంతలు ఇబ్బంది కలిగిస్తే ప్రజలు ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేసే సదుపాయాన్ని కొనసాగిస్తున్నట్టు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ప్రకటించింది. తమ దగ్గరున్న మొబైల్ లేదా కెమెరాతో తీసిన ఫొటోలను బీఎంసీ వెబ్‌సైట్‌లో పోస్టు చేస్తే చాలు.  సమీపంలో ఉన్న సంబంధిత కాంట్రాక్టర్ ద్వారా వెంటనే ఆ గుంతను పూడ్చివేయిస్తామని కార్పొరేషన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలవల్ల నగర రహదారులన్నీ గుంతలమయమయ్యాయి.

ఇక నుంచి ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే వాటిని పూడ్చివేస్తామని బీఎంసీ ప్రకటించింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఉరుకులుపరుగులు తీసే ముంబైకర్లకు బీఎంసీ వార్డు కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేసేంత సమయం ఉండదు. కాలిబాటన వెళుతుండగా రోడ్డుపై గుంత కనిపిస్తే దాని ఫొటో తీసి వెబ్‌సైట్‌లో పెడితే చాలని బీఎంసీ ముంబైకర్లకు సూచించింది. గత సంవత్సరం వర్షాకాలంలో ఏర్పడిన గుంతలు పూడ్చే పనులు పూర్తిచేసే సరికి ఈ ఏడాది జూన్ వచ్చింది. ఈసారి వర్షాలు ఆలస్యం కావడంతో కాట్రాక్టర్లకు కొంత సమయం లభించినట్లయింది. అయితే జూలై మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలు రోడ్లను గుంతలమయంగా మార్చాయి.

 దీంతో వాహనదారులు నరకయాతన అనుభవించడమే గాక, ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా గుంతలను పూడ్చివేయాలని బీఎంసీ  కాంట్రాక్టర్లను ఆదేశించింది. రోడ్ల మరమ్మతులు,గుంతలు పూడ్చే పనులకు రూ.32 కోట్లు నిధులు మంజూరు చేసింది.  బీఎంసీలో అధికారపక్షం శివసేన కూడా రోడ్ల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. స్థాయీసంఘం అధ్యక్షుడు శైలేష్ ఫణసే ప్రతీరోజు రోడ్లపై గుంతలను పరిశీలిస్తున్నారు.  గుంతలు కనిపిస్తే సంబంధిత వార్డు ఇంజనీర్ లేదా అదనపు కమిషనర్‌కు వివరాలు అందజేస్తారు.  వాటిని పూడ్చిన తరువాత మళ్లీ అక్కడే గంతలు ఏర్పడితే, అదే కాంట్రాక్టర్ చేత పూడ్చివేయిస్తున్నామని ఫణసే ఈ సందర్భంగా వివరించారు.

మరిన్ని వార్తలు