కాంగ్రెస్‌లో కల్లోలం 

7 Aug, 2019 03:13 IST|Sakshi

ఆర్టికల్‌ 370 రద్దుకు పలువురు నేతల మద్దతు

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రాజ్యసభ చీఫ్‌ విప్‌

న్యూఢిల్లీ: కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం కాంగ్రెస్‌ పార్టీలో కల్లోలం రేపుతోంది. దేశవ్యాప్తంగా అనేక మంది కాంగ్రెస్‌ నేతలు ఆర్టికల్‌ 370 రద్దుతోపాటు కశ్మీర్‌ పునర్విభజన నిర్ణయాలను స్వాగతిస్తున్నారు. అయితే ఈ నిర్ణయాలను రాజ్యసభ, లోక్‌సభల్లో కాంగ్రెస్‌ పార్టీ చాలా తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ చాలామంది కాంగ్రెస్‌ నేతలు సమర్థిస్తుండటంతో ఆ పార్టీ పరిస్థితి గందరగోళంగా తయారైంది.  

చారిత్రాత్మక తప్పిదాన్ని సరిచేశారు.. 
కొంత ఆలస్యమైనప్పటికీ చారిత్రాత్మక తప్పిదం ఎట్టకేలకు సరిచేశారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జనార్దన్‌ ద్వివేది అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల్లో ఎక్కువ మంది ఆర్టికల్‌ 370 ఉండాలని కోరుకోలేదని, తన రాజకీయ గురువైన రామ్‌ మనోహర్‌ లోహియా 370కి వ్యతిరేకంగా ఉండటమే దీనికి నిదర్శనమని ద్వివేది వ్యాఖ్యానించారు. దేశ సమగ్రత కోసం తీసుకున్న నిర్ణయమే ఆర్టికల్‌ 370 రద్దు అని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ దిపేందర్‌ హుడా అభివర్ణించారు. 21వ శతాబ్దంలో ఆర్టికల్‌ 370 వంటి వాటికి చోటు లేదని, దీన్ని ఎప్పటికైనా రద్దు చేయాలని తాను భావిస్తూ ఉండేవాడని హుడా అన్నారు. శాంతియుతంగా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. 

నా వల్ల కాదు.. 
కశ్మీర్‌ పట్ల కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న వైఖరిని విభేదిస్తూ రాజ్యసభలో ఆ పార్టీ చీఫ్‌ విప్‌గా ఉన్న భువనేశ్వర్‌ కలితా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆర్టికల్‌ 370 రద్దు బిల్లుని వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎంపీలు వ్యవహరించేలా విప్‌ జారీ చేయాలని ఆ పార్టీ ఆయనను కోరగా.. దేశ ప్రజల మనోగతానికి భిన్నంగా తాను వ్యవహరించలేనంటూ పార్టీని వీడారు. 

సింధియా కూడా సపోర్ట్‌.. 
ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్న కాంగ్రెస్‌ నేతల జాబితాలో ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా  చేరారు. జమ్మూ కశ్మీర్‌పై ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని ఆయన అన్నారు. 

అలాంటివారు పార్టీలో ఉండొద్దు.. 
ఆర్టికల్‌ 370 రద్దుకు కాంగ్రెస్‌ నేతల నుంచి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ స్పందించారు. జమ్మూ కశ్మీర్‌ చరిత్ర, కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర తెలియకుండా వాళ్లంతా మాట్లాడుతున్నారని, అలాంటి వారు పార్టీలో ఉండొద్దని స్పష్టం చేశారు.

భద్రతాపరమైన సమస్య లొస్తాయి: రాహుల్‌ 
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌ను రెండు ముక్కలుగా చీల్చేందుకు కేంద్ర ప్రభుత్వం తనకున్న కార్యనిర్వహణాధికారాలను దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ ఆరోపించారు. ‘కేంద్రం నిర్ణయంతో దేశ భద్రత విషయంలో క్లిష్టమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. కశ్మీర్‌లో రాజకీయ పార్టీల నేతలను రహస్య ప్రదేశాల్లో నిర్బంధించారు’అని ట్వీట్‌చేశారు. ‘ఇప్పుడు కశ్మీర్‌లో నాయకత్వ శూన్యత వల్ల ఉగ్రవాదులే నాయకులవుతారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, నాయకులను జైళ్లలో పెట్టి, ఏకపక్షంగా జమ్మూ కశ్మీర్‌ను చీలిస్తే దేశ సమగ్రత మరింత బలపడదు. భారత దేశం అంటే పౌరులే తప్ప భూభాగాలు కాదు’అని రాహుల్‌ వ్యాఖ్యానించారు.

>
మరిన్ని వార్తలు