రగులుతున్న రాజస్థాన్‌.. కేంద్రం సీరియస్‌

6 Dec, 2023 17:53 IST|Sakshi

జైపూర్‌: రాజ్‌పుత్‌ల ఆందోళనలతో రాజస్థాన్‌ అట్టుడికిపోతోంది. కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ హత్యతో రగిలిపోతున్న రాజ్‌పుత్‌ సంస్థలు రోడ్డెక్కాయి. రవాణా స్తంభించిపోగా.. దుకాణాలు మూతపడడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం బంద్‌ వంకతో నిరసనకారులు రోడ్డెక్కి ఉద్రిక్తతలకు కారణం అవుతున్నారు. దీంతో ఈ పరిణామాలను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. 

రాజస్థాన్‌ ఆందోళనలపై కేంద్రం సీరియస్‌ అయ్యింది. ఆందోళనకారుల్ని కట్టడి చేసేందుకు ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ను రంగంలోకి దించింది కేంద్ర హోంశాఖ. దీంతో కేంద్ర బలగాలు రాజస్థాన్‌ పోలీసులతో కలిసి కవ్వింపు చర్యలకు దిగుతున్నవాళ్లను  చెదరగొట్టనున్నాయి. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల విజయంతో సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో బిజీగా ఉన్న బీజేపీకి.. ఈ పరిణామాలు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి.


ఆస్పత్రికి భారీగా..
కర్ణిసేన అధ్యక్షుడు  సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యొదంతం రాజస్థాన్‌ను కుదిపేసింది. ఈ హత్యకు నిరసనగా.. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ రాజ్‌పుత్‌ కర్ణిసేన, ఇతర కమ్యూనిటీలు బంద్‌కు పిలుపు ఇచ్చాయి. అయితే ఈ బంద్‌ ప్రశాంతంగా కొనసాగలేదు. రోడ్లపై టైర్లు తగలబెట్టి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు పలు చోట్ల లాఠీలకు పని చెప్పారు. 

మరోవైపు సుఖ్‌దేవ్‌ మృతదేహం ఇంకా జైపూర్‌ ఆస్పత్రిలోనే ఉంది. దీంతో ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో రాజ్‌పుత్‌లు వస్తుండడంతో అక్కడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యపై రాజ్‌పుత్ కర్ణి సేన న్యాయ విచారణకు(జ్యూడీషియల్‌ ఎంక్వైరీ) డిమాండ్ చేస్తోంది. కానీ, రాజస్థాన్‌ డీజీపీ ఉమేష్ మిశ్రా మాత్రం ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) ఈ కేసు అప్పగించారు.   

ఇదీ చదవండి: గోగామేడి హంతకులు వీళ్లేనా?.. ఫొటోలు రిలీజ్‌

>
మరిన్ని వార్తలు