ఖలిస్తాన్‌ ఉగ్రవాదికి ఆహ్వానం

23 Feb, 2018 01:52 IST|Sakshi
ముంబైలో జరిగిన కార్యక్రమంలో ట్రూడోతో జస్పాల్‌ అత్వాల్‌ (వృత్తంలోని వ్యక్తి)

ఢిల్లీలో కెనడా హైకమిషన్‌ నిర్వాకం

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం: ట్రూడో

వీసా జారీపై విచారణ జరుపుతున్నాం: భారత్‌  

న్యూఢిల్లీ: ఖలిస్తాన్‌ వేర్పాటువాదులకు మద్ద తు ఇవ్వబోమని హామీ ఇచ్చి ఒక్కరోజు గడవకముందే కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. దేశరాజధానిలో గురువారం ట్రూడో గౌరవార్థం కెనడా హైకమిషనర్‌ నాదిర్‌ పటేల్‌ నిర్వహించనున్న విందుకు ఆ దేశ అధికారులు సాక్షాత్తూ ఓ ఉగ్రవాదికి ఆహ్వానం పంపారు. ప్రధాని మోదీని ట్రూడో కలుసుకోవడానికి కేవలం ఒక్కరోజు ముందే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ట్రూడో.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

1986లో కెనడా పర్యటనకు వెళ్లిన పంజాబ్‌ మంత్రి మల్కియాత్‌ సింగ్‌ సిద్ధూపై వాంకోవర్‌లో హత్యాయత్నం చేసిన ఇంటర్నేషనల్‌ సిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ సభ్యుడు జస్పాల్‌ అత్వాల్‌కు కెనడా అధికారులు గురువారం విందుకు ఆహ్వానం పంపారు. మంత్రిపై దాడి చేసినందుకు అప్పట్లో జస్పాల్‌కు కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ట్రూడో గౌరవార్థం అంతకుముందు ముంబైలో నిర్వహించిన కార్యక్రమానికి కూడా హాజరైన జస్పాల్, ఏకంగా కెనడా ప్రధాని భార్య సోఫీ, మంత్రి అమర్జిత్‌ సోహీలతో ఫొటోలు కూడా దిగాడు.

ఈ ఫొటోల్లో ఉన్న జస్పాల్‌ను కెనడియన్‌ మీడియా గుర్తించడంతో ఆ దేశ అధికారుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన కెనడా హైకమిషన్‌.. జస్పాల్‌కు పంపిన ఆహ్వానాన్ని రద్దుచేసింది. తన సిఫార్సుతోనే కెనడా హైకమిషన్‌ సిబ్బంది జస్పాల్‌ను విందుకు ఆహ్వానించారని కెనడా ఎంపీ రణ్‌దీప్‌ సురాయ్‌ అంగీ కరించారు. జస్పాల్‌ భారత్‌కు వచ్చేందుకు వీసా ఎలా లభించిందన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నట్లు విదేశాంగ శాఖ చెప్పింది.

మరిన్ని వార్తలు